TG: ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన వైద్య సంఘాలు

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 229పై వైద్యసంఘాలు భగ్గుమన్నాయి.

TG: ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన వైద్య సంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 229పై వైద్యసంఘాలు భగ్గుమన్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 229ను నిరసిస్తూ రాష్ట్రంలోని అలోపతి వైద్యుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. కోఠిలోని ఐఎంఏ హాల్‌లో శనివారం రాత్రి జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన వైద్య సంఘాల ప్రతినిధులు పాల్గొని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఖండించారు. ఈ సందర్భంగా తెలంగాణ అలోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్స్ - జాయింట్ యాక్షన్ కమిటీ (టాడా-జేఏసీ) పేరిట ఉమ్మడి వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో నలుగురు ఎక్స్-అఫిషియో సభ్యులను నియమించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 229.. కౌన్సిల్ ప్రజాస్వామ్య స్వభావానికి విఘాతం కలిగిస్తుందని వైద్య సంఘాలు ఆరోపించాయి. ఇది వైద్య మండలి వ్యవహారాల్లో అనవసరమైన ప్రభుత్వ జోక్యానికి దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి.

జీవో 229ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టాడా-జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులందరూ విధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కొనసాగిస్తారని తెలిపారు. ప్రధాని కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు వైద్యుల నుంచి సామూహిక వినతిపత్రాలు పంపుతామని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో దశలవారీగా వైద్య సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. చివరి అస్త్రంగా హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రోగుల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే మెడికల్ కౌన్సిల్ స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైద్య సంఘాలు తేల్చిచెప్పాయి. ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో ఐఎంఏ, హెచ్ఆర్డీఏ, టీ-జుడా, టీ-ఎస్ఆర్డీఏ, టీడీఎఫ్ సహా పలు ప్రముఖ వైద్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story