- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాటే ఆయన శ్వాస.. డప్పే ఆయుధం
జననాట్యమండలి కళాకారుడు డప్పు రమేశ్ భౌతికంగా దూరమైనా ఆయన పాటలు, ప్రజాకళా రూపాలు మాత్రం అజరామరం

దిశ, తెలంగాణ బ్యూరో : జననాట్యమండలి కళాకారుడు డప్పు రమేశ్ భౌతికంగా దూరమైనా ఆయన పాటలు, ప్రజాకళా రూపాలు మాత్రం అజరామరం అని మావోయిస్టు పార్టీ అభివర్ణించింది. ఆరు పదుల వయసులో నలభై ఏళ్ళ పాటు విప్లవ ప్రజా ఉద్యమంతోనే అంటిపెట్టుకుని ఉన్నారని, చివరి శ్వాస వరకు ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేశారని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటలో పేర్కొన్నారు. బీపీ, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలోనే విప్లవకారులపై, సానుభూతిపరులపై ఎన్ఐఏ దాడులు ముమ్మరమయ్యాయని, ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. పాటనే శ్వాసగా, డప్పునే ఆయుధంగా మల్చుకున్న డప్పు రమేశ్ విప్లవోద్యమ కళారంగానికి ఎనలేని సేవలందించారని నివాళులర్పించారు.
ప్రజల గుండె చప్పుడునే జననాట్యమండలి డప్పుల చప్పుడుగా మార్చిన డప్పు రమేశ్ విద్యార్థిగా ఉన్నప్పుడే 1980-81 కాలంల పార్టీతో సంబంధాల్లోకి వచ్చి కొద్దికాలంలోనే పూర్తికాలం విప్లవ కార్యకర్తగా మారారని గుర్తుచేశారు. అమరత్వంపైనా, పార్టీ కార్యక్రమంపైనా, పాలకవర్గాల దోపిడీపైనా, ప్రభుత్వాల నిర్భంధంపైనా వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా స్పందించి ప్రజల బాణిలో 80కి పైగా పాటలను సొంతంగా రాసి డప్పుల చప్పుడుతో తెలుగు ప్రజల్లోకి తీసుకెళ్ళారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని నిర్భంధానికి ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాల్లోని సాంస్కృతిక విప్లవోద్యమంలో భాగస్వాములై అక్కడి ప్రజల్లో విప్లవ రాజకీయాలను పాటలు, కళల రూపంలో అందించడంలో రమేశ్ పాత్ర విభిన్నమైనదని పేర్కొన్నారు.
పార్టీలో రెండో సంక్షోభం చోటుచేసుకున్న సమయంలోని నిర్భంధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 1995లో సాంస్కృతిక పర్‌స్పెక్టివ్ ఉనికిలోకి వచ్చిందని, సాయుధ దళాల్లో జననాట్యమండలి సాంస్కృతిక విభాగం కూడా ఒక భాగమైందని, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే జోనల్ సాంస్కృతిక సమన్వయ కమిటీ బాధ్యుడిగా నియమితులై ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో పాటలను క్యాసెట్లు, సీడీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళారని పేర్కొన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన చర్చల సందర్భంగా అజ్ఞాత జీవితం వదిలి బహిరంగ జీవితాన్ని ఎంచుకున్నా విప్లవం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదని, ప్రజల విముక్తి పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోలేదని, చిట్టచివరి శ్వాస వరకు నిజమైన విప్లవ కళాకారుడిగానే జీవించారని కొనియాడారు.
సాంస్కృతిక రంగంలో డప్పు రమేశ్ కృషి విప్లవ సాంస్కృతిక రంగానికి ఎల్లకాలం చెదిరిపోని ఆస్తిగానే ఉంటుందని, ఆ కృషిని మరింత ముందుకు తీసుకెళ్ళడమే ఇప్పుడు పార్టీ ముందు ఉన్న కర్తవ్యమని పార్టీ కేంద్ర కమిటీ తరపున అభయ్ నివాళులర్పించారు.






