- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద పరిస్థితుల్లో వ్యక్తి అదృశ్యం.. సంతోష్‌నగర్ పోలీసుల గాలింపు
సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, చంపాపేట్: సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ రక్షాపురం కాలనీకి చెందిన ఎం.సురేందర్ కుమార్(46) గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆయన భార్య ఎం.సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ‘మ్యాన్ మిస్సింగ్’ కేసు నమోదు చేశారు. సురేందర్ కుమార్‌కు మద్యపాన వ్యసనం ఉండటంతో కుటుంబంలో తరచూ విభేదాలు చోటుచేసుకునేవని, ఈ నేపథ్యంలో భార్య మరియు పెద్ద కుమారుడు గత రెండు నెలలుగా దిల్సుఖ్‌నగర్‌లోని హాస్టళ్లలో నివసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా సురేందర్ కుమార్ తన చిన్న కుమారుడితో కలిసి న్యూ రక్షాపురం కాలనీలోనే ఉంటున్నారు. గత మే 23వ తేదీ రాత్రి వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన సురేందర్ కుమార్ అనంతరం మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. మే 29న ఉదయం తన చిన్న కుమారుడు ఓ స్థానిక వ్యక్తి ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి, బొల్లారం ప్రాంతంలో తన తండ్రి మృతి చెందినట్లు చెప్పాడని, అయితే ఆ విషయం పై ఎలాంటి స్పష్టమైన సమాచారం లభించలేదని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా సురేందర్ కుమార్ జాడ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అదృశ్యమైన వ్యక్తి వివరాలు..
ఎం. సురేందర్ కుమార్, తండ్రి పేరు ఎం. శ్రీరాములు, వయస్సు 46 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, నలుపు రంగు, అండాకార ముఖం. తెలుగు, హిందీ భాషలు మాట్లాడగలరు. ఎడమ గడ్డం వైపున పుట్టుమచ్చ గుర్తుగా ఉంది. సురేందర్ కుమార్ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే సంతోష్‌నగర్ పోలీసులను 8712661296, 8712661024, 8712660339 నంబర్లలో సంప్రదించాలని స్టేషన్ హౌస్ అధికారి పి. మణికంఠ రాజు కోరారు.






