మహిళలకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి "మహాలక్ష్మీ స్మార్ట్ కార్డ్స్"

by Muthe.Rajitha |

తెలంగాణలో ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ఇకపై ID కార్డుల మోత తప్పేలా స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం.

మహిళలకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి మహాలక్ష్మీ స్మార్ట్ కార్డ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని మహిళా ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ (TSRTC) ఉచిత బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ప్రతిసారీ ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేకుండా, ఇకపై డిజిటల్ విధానంలో "మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు" (Mahalakshmi Smart Cards) జారీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకాన్ని ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కాకుండా, మొదట ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రారంభించనున్నారు. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను పరిశీలించిన అనంతరం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.

అర్హులైన మహిళలు తమ సమీపంలోని బస్ పాస్ కేంద్రాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లి, కేవలం రూ.50 నామినల్ ఫీజు చెల్లించి ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డును సొంతం చేసుకోవచ్చు. కాగా ఈ స్మార్ట్ కార్డులు చేతికి వచ్చేంతవరకు మహిళలు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే.. బస్సుల్లో తమ ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించి ఉచిత ప్రయాణాన్ని యధావిధిగా కొనసాగించవచ్చు. ఈ స్మార్ట్ కార్డుల విధానం అందుబాటులోకి రావడం వల్ల బస్సుల్లో కండక్టర్లు ప్రతి ఒక్కరి ఐడీ కార్డులను, అడ్రస్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసే సమయం ఆదా అవుతుంది. కేవలం కార్డును స్కాన్ చేయడం ద్వారా టికెట్ జారీ ప్రక్రియ వేగంగా ముగుస్తుంది. తద్వారా మహిళలకు ఐడీ కార్డుల మోత తప్పడమే కాకుండా ఆర్టీసీ నిర్వహణ కూడా మరింత సులభతరం కానుంది.

Next Story