గంగాధరలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘102’ వాహనం.. డ్రైవర్ నిర్వాకంపై స్థానికుల ఆగ్రహం?

by Jakkula.Mamatha |

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు, గర్భిణులకు సురక్షితమైన ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన '102' వాహనం ఇక్కడ దారి తప్పుతుంది.

గంగాధరలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘102’ వాహనం.. డ్రైవర్ నిర్వాకంపై స్థానికుల ఆగ్రహం?
X

దిశ, గంగాధర: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు, గర్భిణులకు సురక్షితమైన ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన '102' వాహనం ఇక్కడ దారి తప్పుతుంది. గంగాధర మండల కేంద్రంలో కేటాయించిన 102 వాహనాన్ని గర్భిణుల సేవలకు కాకుండా, సదరు డ్రైవర్ తన సొంత పనులకు యథేచ్ఛగా వాడుకుంటున్న తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గర్భిణులను ఆసుపత్రికి తీసుకురావడానికి, ప్రసవం పూర్తయిన తర్వాత బాలింతలను సురక్షితంగా వారి ఇళ్లకు చేరవేయడానికి మాత్రమే ఈ 102 వాహనాలను ఉపయోగించాలి. కానీ, గంగాధరలో మాత్రం సీన్ రివర్స్ అయింది.

అత్యవసర సేవల్లో ఉండాల్సిన ఈ వాహనం డ్రైవర్ వ్యక్తిగత పనులకు, సొంత అవసరాలకు రోడ్లపై చక్కర్లు కొడుతోందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గర్భిణులు అత్యవసర సమయాల్లో వాహనం కోసం వేచి చూసే పరిస్థితి ఉంటే.. మరోవైపు ప్రభుత్వ నిధులతో నడిచే వాహనాన్ని ఇలా ప్రైవేట్ అవసరాలకు వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు ఇలా దుర్వినియోగం అవుతున్నా, సంబంధిత వైద్యాధికారులు గానీ, పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు గానీ స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై బాధ్యులు ఎవరని, అడిగే అధికారులు ఉన్నారా లేదా అంటూ స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ వాహనాన్ని సొంత పనులకు వాడుకుంటున్న డ్రైవర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, 102 సేవలు కేవలం గర్భిణులకే అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story