లష్కర్-ఎ-తోయిబా కమాండర్ దారుణ హత్య

by Muthe.Rajitha |

పాకిస్తాన్‌లో ముర్కీదేలోని లష్కర్-ఎ-తోయిబా కీలక కమాండర్ బిలాల్ హరీఫ్ సలాఫీ దారుణ హత్యకు గురయ్యారు.

లష్కర్-ఎ-తోయిబా కమాండర్ దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : రంజాన్ పర్వదినాన లష్కర్-ఎ-తోయిబా కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని లాహోర్ సమీపంలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం 'మార్కజ్ తాయిబా' (Markaz Taiba) లో శనివారం అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈద్ ప్రార్థనలు ముగిసి బయటకు వస్తున్న సమయంలో, LeT సీనియర్ కమాండర్ బిలాల్ అరిఫ్ సలాఫీపై గుర్తు తెలియని దుండగులు మెరుపు దాడి చేశారు. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఈ కాంప్లెక్స్‌లోనే దుండగులు అతన్ని అతి సమీపం నుండి తుపాకీతో కాల్చి, అనంతరం కత్తులతో నరికి కిరాతకంగా చంపడం గమనార్హం. 2005 నుండి సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సలాఫీ.. నిధుల సమీకరణ, కొత్త రిక్రూట్‌మెంట్లలో ఆరితేరిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈ దాడి జరిగిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించినట్లు నివేదికలు ధృవీకరిస్తున్నాయి.

నిందితులు అత్యంత హై-సెక్యూరిటీ జోన్‌లోకి ఎలా ప్రవేశించారు, దాడి తర్వాత ఎలా తప్పించుకోగలిగారు అన్నది తీవ్ర చర్చకు దారి తీసింది. గతంలో 2025 మే నెలలో భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) లో ఈ మురిడ్కే క్యాంప్ భారీగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ దాడి నుండి కోలుకుని ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణం చేసుకుంటున్న తరుణంలో, సంస్థలోని కీలక నేత ఇలా హత్యకు గురవ్వడం లష్కర్ వర్గాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో ఈ హత్యకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ హత్య వెనుక ఉన్న ఉద్దేశంపై ప్రస్తుతం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఉగ్రవాద గ్రూపుల మధ్య ఉన్న అంతర్గత గొడవలా,లేక ఇతర దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పక్కా వ్యూహంతో చేసిన దాడా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. సలాఫీ హత్య తర్వాత మురిడ్కే పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్ రేంజర్లు భారీగా మోహరించారు.

Next Story