నిద్ర తగ్గితే నిర్ణయాలు తప్పుతాయి.. వైద్యుల సంచలన విశ్లేషణ..!

by Malleboina Mahesh |

రోజుకు 6 గంటలే నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు రెండు రోజులు మేల్కొన్న వ్యక్తిలా మారిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండాలంటే 7-9 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు.

నిద్ర తగ్గితే నిర్ణయాలు తప్పుతాయి.. వైద్యుల సంచలన విశ్లేషణ..!
X

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో ఉద్యోగాల కారణంగా ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల రాత్రిళ్లు తక్కువ సమయం నిద్రపోతున్నారు. రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతూ, తాము ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తున్నారు. కానీ అది కేవలం వారి భ్రమ మాత్రమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు రోజుకు 6 గంటల చొప్పున నిద్ర తగ్గించడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది ఏకధాటిగా రెండు రోజుల పాటు నిద్ర లేని వ్యక్తి మెదడు ఎలా పనిచేస్తుందో, అంతటి ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం.. కానీ నిద్ర తగ్గడం వల్ల మన దైనందిన పనితీరులో మార్పులు వచ్చినప్పటికీ, దానిని మనం వెంటనే గుర్తించలేకపోవడం అసలైన సమస్య. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు, ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగే అవకాశం ఉంది. మెదడులోని నాడీ వ్యవస్థ సరిగ్గా స్పందించక పోవడం వల్ల జ్ఞాపకశక్తి మందగించడం, చిరాకు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్ర తక్కువైన ప్రతిరోజూ మెదడు తన సామర్థ్యాన్ని కోల్పోతూనే ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు.

మెదడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వయస్సును బట్టి రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల గాఢ నిద్ర తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. సరైన నిద్ర వల్ల మెదడులోని వ్యర్థాలు శుభ్రపడటమే కాకుండా, కణాలు తిరిగి పుంజుకుంటాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలంలో అల్జీమర్స్, అధిక రక్తపోటు, ఇతర నాడీ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి తన పని కంటే నిద్రకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

Next Story