విమ‌ర్శలు చేయ‌డం సుల‌భం.. ప‌నులు చేయ‌డ‌మే క‌ష్టం: కేటీఆర్

by Dishanational1 |
విమ‌ర్శలు చేయ‌డం సుల‌భం.. ప‌నులు చేయ‌డ‌మే క‌ష్టం: కేటీఆర్
X

దిశ, సిరిసిల్ల: బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు చేయడం సులువేనని...కానీ పనులు చేయడమే కష్టమని మంత్రి అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో వంద పడకల ఆస్పత్రిలో మంత్రి కేటీఆర్ హెల్త్ ఫ్రొపైల్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి ఎన్నో పథకాలు అందిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. విమర్శలు చేయడం సులభమేనని.. పనులు చేయడమే కష్టమని మంత్రి అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై చర్చకు సిద్ధమన్నారు. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరికి వస్తానని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. సిరిసిల్ల రూపురేఖలు మార్చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని.. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సంఖ్య కూడా పెరిగిందన్నారు.

హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ‌ను నిర్మిద్దాం...

ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం డిజిటలైజేషన్ చేసి, ఆరోగ్య వివరాలను సమగ్రంగా పొందుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ-హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలో అమలు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ వ్యక్తి యొక్క రక్త నమూనాలను సేకరించి, పరీక్షల నిర్ధారణ కేంద్రానికి పంపడం జరుగుతుందని, ల్యాబ్ లో నమూనాలను పరీక్షించిన అనంతరం వారి యొక్క పూర్తి ఆరోగ్య వివరాలను ఆన్ లైన్ లో భద్రపరచి, ఆరోగ్య సమస్యలు, వివరాలను తెలిపేందుకు డిజిటల్ కార్డును అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. హెల్త్​రికార్డుల ద్వారా అత్యవసరమైన పరిస్థితుల్లో వెంటనే వైద్యం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ అన్నారని, ఆ దిశగా తాము కృషి చేస్తున్నామని అన్నారు. హెల్త్ ప్రొఫైల్ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లాలో 220 బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ప్రతీ ఒక్కరి రక్త నమూనాలు సేకరిస్తారని అన్నారు. ఈ బృందాలు ప్రతీ ఇంటికీ తిరిగి ఒక్కో బృందం రోజుకు 40 మంది వ్యక్తుల నుండి నమూనాలను సేకరించేలా, అట్టి బృందాలకు తగిన ప్రణాళిక రూపొందించి, అవగాహనా కల్పించడం జరిగిందని తెలిపారు. ఒక్కో బృందంలో ఇద్దరు ఆశాలు, ఒక ఏఎన్ఎం ఉంటారని అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 4 లక్షల 22 వేల మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ లో ఆనారోగ్యంతో ఏదైనా ఆసుపత్రికి వెళ్తే ఈ కార్డు ద్వారా మన ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వైద్య సేవలు అందించడానికి అనువుగా ఉంటుందని అన్నారు. రాబోయే 60 రోజుల్లో ఇంటింటికీ ఆరోగ్య కార్యకర్తలు తిరిగి నమూనాలు సేకరిస్తారన్నారు. హెల్త్ రికార్డ్ తయారు చేయడం ద్వారా వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు మళ్లీ కొత్తగా ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు చేయడం ఉండదని, దీని వల్ల సమయం ఆదా అయ్యి, విలువైన ప్రాణాలను కాపాడే ఆస్కారం ఉంటుందన్నారు. హెల్త్ కార్డు ఉంటే ఏ ఆసుపత్రికి వెళ్ళినా వైద్యం చేయడానికి సులభంగా ఉంటుందన్నారు.

రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అందరికీ హెల్త్ కార్డులను అందజేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. ప్రాంతాల వారీగా విభజించి ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో వివిధ వ్యాధులు ఉంటాయో వాటికి సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. జిల్లాలో వైద్యారోగ్య రంగంలో సిబ్బంది నేతృత్వంలో విశిష్టమైన సేవలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాకముందు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ లేవని, విద్య, వైద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుందని మంత్రి అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 3 సిటీ స్కాన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీవిత చరమాంకంలో ఉన్నవారికి, మరణానికి దగ్గరలో ఉన్నవారి కోసం పాలియేటివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. 70 సంవత్సరాల్లో కాని పనులు 7 ఏండ్లలో చేసుకున్నామన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమ అమలులో రాష్ట్రం మొత్తానికి మన జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో ఒక స్టేడియం నిర్మించడానికి, సినారె పేరున రూ. 3 కోట్లతో భవనం నిర్మాణంకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Next Story