హ్యామ్ రోడ్ల టెండర్ల విషయంలో కీలక నిర్ణయం.. పేమెంట్ సెక్యూరిటీ మెకానిజానికి ఆమోదం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో చేపట్టే రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

హ్యామ్ రోడ్ల టెండర్ల విషయంలో కీలక నిర్ణయం.. పేమెంట్ సెక్యూరిటీ మెకానిజానికి ఆమోదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో చేపట్టే రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ గురువారం జీవో నెం.2ను జారీ చేసింది. హ్యామ్ ప్రాజెక్టుల నిర్వహణలో మరింత స్పష్టత, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో టెండర్ నిబంధనలు, ఒప్పందాల ప్రక్రియలో మార్పులు చేసింది. హ్యామ్ విధానంలో చేపట్టే పనులకు సంబంధించి 'పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం' (చెల్లింపుల భద్రతా విధానం) అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతోపాటు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్.ఎఫ్.పి.), డ్రాఫ్ట్ కన్సెషన్ అగ్రిమెంట్ (డీసీఏ), టెండర్ నిబంధనల సవరణలకు కూడా ఆమోదం తెలిపింది. తక్షణమే ఎస్క్రో ఖాతా (మధ్యవర్తిత్వ ఖాతా), పేమెంట్ సెక్యూరిటీ ఫండ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్అండ్ బి చీఫ్ ఇంజనీర్ ను ప్రభుత్వం ఆదేశించింది.

రోడ్ల నిర్మాణానికి భరోసా...

తాజా జీవో నెం.2. హ్యామ్ లో చేపట్టే రోడ్ల కోసం ప్రభుత్వం ఇకపై ఒక ప్రత్యేకమైన ఖాతాను (ఎస్క్రో అకౌంట్) తెరుస్తుంది. దీనిని ఒక ‘లాకర్’ లాగా భావించవచ్చు. ఈ లాకర్ తాళం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండదు. బ్యాంకు (ఏజెంట్) పర్యవేక్షణలో ఉంటుంది. ఒక్కసారి డబ్బు ఇందులో పడ్డాక.. ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుని వేరే ఖర్చులకు వాడటానికి కుదరదు. నిధుల విడుదలకు అంపైర్ పాత్రను ఇండిపెండెంట్ ఇంజనీర్ నిర్వహిస్తారు. ప్రభుత్వానికి, కాంట్రాక్టరుకు సంబంధం లేని తటస్థ వ్యక్తే ఇండిపెండెంట్ ఇంజనీర్. ఈయన ఫీల్డ్ మీదకు వెళ్లి రోడ్డు పని నాణ్యతను, జరిగిన పనిని పరిశీలిస్తారు. ఈయన సర్టిఫికెట్ ఇస్తేనే.. ఆ ఎస్క్రో ఖాతా (లాకర్) నుంచి డబ్బులు కాంట్రాక్టరుకు వెళ్తాయి. ఈ కొత్త విధానం వల్ల.. డబ్బులు ఎక్కడికీ పోవనే నమ్మకం కాంట్రాక్టర్ కు కలుగుతుంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చకచకా పూర్తవుతోంది. నిధుల కొరత, బిల్లుల పెండింగ్ అనే సాకులు లేకుండా రోడ్ల పనులు పరుగులు పెట్టించేందుకే ప్రభుత్వం ఈ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజాన్ని అమల్లోకి తెచ్చిందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

Next Story