- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం
కర్ణాటక బడ్జెట్ 2026లో సంచలనం: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై పూర్తి నిషేధం విధిస్తూ సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 16 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించకుండా పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, వారి భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు. దీంతో భారతదేశంలో ఇటువంటి సాహసోపేతమైన చర్య తీసుకున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక చరిత్రలో నిలిచింది.
ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, పెరుగుతున్న మొబైల్ ఫోన్ వ్యసనం పై ఆందోళనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా లభిస్తున్న సమాచారం వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత కోల్పోవడమే కాకుండా, మానసిక ఒత్తిడి, సైబర్ బుల్లీయింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాల బారిన పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఇటువంటి నిషేధాలను అమలు చేయడాన్ని ఉదాహరణగా తీసుకున్న ప్రభుత్వం, నిపుణులు, విద్యావేత్తలతో చర్చించిన అనంతరం ఈ సమగ్ర విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో వయస్సు ధృవీకరణ (Age Verification) ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు అతిక్రమించే టెక్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా "మొబైల్ వదిలేయండి - పుస్తకం పట్టండి" (Mobile Bidi, Pustaka Hidi) వంటి వినూత్న కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది. అలాగే డిజిటల్ అడిక్షన్ నుండి రాబోయే తరాలను రక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






