- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియా పతనం అప్పటినుంచేనా?
వరల్డ్ కప్ ట్రోఫీని అవమానించినందుకే ఆస్ట్రేలియా కర్మ ఫలితాన్ని అనుభవిస్తోందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు గురించి తెలియని వారు ఉండరు. అన్ని రకాల ఫార్మాట్లలో, అన్ని ట్రోఫీలు దక్కించుకొని ప్రపంచ క్రికెట్ కు రారాజుగా వెలుగొందే జట్టు ఏదైనా ఉంది అంటే ఆస్ట్రేలియా అనే పేరు తప్పక వినిపిస్తుంది. అయితే అనూహ్యంగా కొంతకాలం నుంచి ఆసీస్ ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఏకంగా 2026 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ కావడం పెద్ద సంచలనంగా మారింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత అంటే.. 2009 తర్వాత లీగ్ దశలోనే బయటకు వెళ్లడం ఇదే. జింబాబ్వే, శ్రీలంకల చేతిలో ఘోర ఓటములు, కీలక ఆటగాళ్లకు గాయాలు, తప్పుడు సెలెక్షన్ నిర్ణయాలు – ఇవన్నీ కలిసి ఆసీస్ పరాభవానికి కారణమయ్యాయి. అయితే సోషల్ మీడియాలో మరో వాదన వైరల్ అవుతోంది. "2023 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీకి ఆసీస్ ఆటగాడు చేసిన అగౌరవానికి కర్మ ఫలితం ఇది" అని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఆరో టైటిల్ గెలిచిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టి కూర్చున్నాడు. అలా ట్రోఫీపై కాళ్లు రెస్ట్ చేసినట్టు కూర్చోవడంతో క్రికెట్ ప్రేమికులు భగ్గుమన్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని అవమానించడం ఏమిటని తిట్టిపోశారు. ప్రముఖ క్రికెటర్లు కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆస్ట్రేలియా జట్టును బ్యాన్ చేయాలని కూడా క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసారు. అయితే మిచెల్ మార్ష్ అంతటితో ఆగకుండా ఓ రేడియో ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. "నేను మళ్ళీ అలాగే చేస్తాను" అనడం మరింత విమర్శలకు దారి తీసింది. ఇది పూర్తిగా ఆసీస్ జట్టు అహంకారం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కర్మ సిద్ధాంతం నిజమేనా?
ఇక ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్‌లోనే బయటకు వెళ్లడంతో సోషల్ మీడియాలో "కర్మ రిటర్న్" అంటూ ఆసీస్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇదొకసారి మాత్రమే కాదు.. ఆ ఘటన అనంతరం 2024 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ మిస్ కావడం, 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరకపోవడం, 2025 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమి.. వంటివన్నీ కలిపి "ట్రోఫీ గాడ్ ఆఫ్ క్రికెట్ రివేంజ్ తీసుకుంది" అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత అభిమానులు "టీంఇండియాతోపాటు మిగిలిన జట్లు గెలిచినప్పుడు ట్రోఫీని గౌరవిస్తారు, ఆసీస్ తన అహంకారాన్ని ప్రదర్శించినందుకు ఫలితం అనుభవించాల్సిందే" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అసలు కారణాలు ఇవే
కానీ నిజానికి ఆస్ట్రేలియా వైదొలగడానికి కారణాలు కర్మ రిటర్న్స్ కాకపోవచ్చు. ప్లేయర్స్ వరుస గాయాలు గట్టి దెబ్బ కొట్టాయి. కెప్టెన్ మిచెల్ మార్ష్ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు. హజిల్‌వుడ్, కమిన్స్ వంటి సీనియర్లు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడ్డారు. రెండవది సెలెక్షన్ తప్పిదాలు కుడా కారణమే. స్పిన్ కండిషన్స్‌లో సరైన ప్రిపరేషన్ లేకుండా వెళ్లడం, BBL ఫైనల్స్‌కి ప్రాధాన్యత ఇవ్వడం వంటి నిర్ణయాలు ఇపుడు విమర్శలకు గురవుతున్నాయి. టిమ్ డేవిడ్‌ను 4వ స్థానానికి ప్రమోట్ చేయడం ఫలితం ఇవ్వలేదు. మూడవది బౌలింగ్ వైఫల్యం.. చివరి రెండు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకోగలగడం బౌలింగ్ లో ఆసీస్ ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తుంది. పేసర్లు, స్పిన్నర్లు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అలాగే సబ్‌కాంటినెంట్ పిచ్‌లపై ఫార్మ్ సమస్యలు, ఇటీవల సిరీస్‌లలో పరాజయాలు (పాకిస్తాన్ చేత 3-0 వైట్‌వాష్) కూడా ప్రభావం చూపాయి.
మూఢ నమ్మకమా...!
అందువల్ల "ట్రోఫీని అగౌరవ పరచడం వల్ల వచ్చిన కర్మ రిటర్న్స్"అనేది ఒక సోషల్ మీడియా సూపర్‌స్టిషన్ మాత్రమే. క్రికెట్‌లో గెలుపు-ఓటములు అనేవి జట్టు కూర్పు, ఫిట్‌నెస్, స్ట్రాటజీ, కండిషన్స్ మీద ఆధారపడతాయి. ఒక ఫోటో వల్ల వరల్డ్ కప్ ఫలితం మారదు. కానీ అభిమానుల భావోద్వేగాలు, క్రీడా సంస్కృతి, ట్రోఫీ పట్ల గౌరవం వంటి అంశాలు చర్చకు దారి తీసిన సంగతి మాత్రం మార్చలేని నిజం.






