హార్మూజ్ లో అడుగుపెడితే ప్రాణాలు దక్కవు : IRGC వార్నింగ్

by Muthe.Rajitha |

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు గత 24 గంటల్లో తీవ్ర స్థాయికి చేరాయి.

హార్మూజ్ లో అడుగుపెడితే ప్రాణాలు దక్కవు : IRGC వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు గత 24 గంటల్లో తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికన్ యుద్ధ నౌకలు హార్మూజ్ జలసంధిలో అడుగుపెట్టడాన్ని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. "ఏ మిలిటరీ నౌక అయినా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది" అని బహిరంగంగా హెచ్చరించింది. అమెరికా హార్మూజ్ ప్రాంతంలో చేపట్టిన మైన్-క్లియరింగ్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. ఇరాన్ స్టేట్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. తమ నేవీ రేడియో సంకేతాల ద్వారా అమెరికా నౌకలకు 30 నిమిషాల గడువు ఇచ్చిందని, ఆ గడువు దాటితే దాడులు తప్పవని హెచ్చరించినట్లు పేర్కొంది. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ పెంచామని, జలసంధిపై తమకు తిరుగులేని నియంత్రణ ఉందని వారు స్పష్టం చేశారు.

అయిత అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తన చర్యలను సమర్థించుకుంటూ.. అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రత కోసం ఇరాన్ గతంలో వేసిన ప్రమాదకరమైన సీ మైన్లను తొలగించడం తమ ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది.అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) అమలు చేస్తున్నట్లు ప్రకటించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. ఈ దిగ్బంధనం కారణంగా సుమారు 800కు పైగా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు నిలిచిపోయాయని ప్రాథమిక సమాచారం.

పాకిస్థాన్‌లో జరుగుతున్న శాంతి చర్చలు దాదాపుగా నిలిచిపోయాయని సమాచారం. ఇరాన్ ఈ అమెరికా చర్యను కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా పరిగణిస్తుండగా, అమెరికా తన మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల ఇంధన భద్రతను కాపాడటానికి ఇరాన్ తీరును అడ్డుకోవాల్సి ఉందని వాదిస్తోంది. ఈ వివాదం ఫలితంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురయ్యే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఈ సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఒక సంక్షోభం వైపు నెట్టుకుపోతున్నాయి. ఒకవైపు దౌత్యం వైఫల్యం చెందడం, మరోవైపు నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుండటంతో రాబోయే 48 గంటలు అత్యంత కీలకంగా మారాయి.

Next Story