- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాక్ కు చేరుతున్న ఇరాన్ పౌరులు.. మద్దతు మాత్రం స్వదేశానికే!
యుద్ధం కారణంగా నిత్యావసర సరుకుల కోసం ఇరానీయులు పొరుగు దేశమైన ఇరాక్ లోకి వెళుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర వైమానిక దాడులతో ఇరాన్ పౌరుల జనజీవనం అతలాకుతలమవుతోంది. యుద్ధం కారణంగా తలెత్తిన విద్యుత్ కోతలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వినిపించే పేలుడు శబ్దాలు, ధ్వంసమవుతున్న ఇళ్లు, తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఇరాన్ పౌరులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని, కనీస అవసరాల కోసం కూడా పోరాడాల్సి వస్తోందని అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయానక పరిస్థితుల నుండి తాత్కాలిక ఉపశమనం కోసం, నిత్యావసర సరుకుల కోసం ఇరానీయులు పొరుగు దేశమైన ఇరాక్ లోకి వెళుతున్నారు.
నిత్యవసరాల కోసం
ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లోని అబుదాన్, అహ్వాజ్ వంటి నగరాల నుండి పౌరులు బస్రాలోని షాలమ్చే (Shalamcheh) సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు. సరిహద్దుల్లో రాకపోకలు గణనీయంగా తగ్గినప్పటికీ, చౌక ధరలకు లభించే నిత్యావసర సరుకులు, నిరంతరాయంగా అందే ఇంటర్నెట్ సౌకర్యం కోసం ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కేవలం వస్తువుల కోసమే కాకుండా, ఇరాక్‌లో ఉన్న తమ బంధువుల ఇళ్లలో కొంతకాలం బస చేసి, పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. యుద్ధం వల్ల తలెత్తిన కమ్యూనికేషన్ గ్యాప్‌ను భర్తీ చేసుకునేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కోసం సరిహద్దులు దాటడం ఇక్కడి ప్రజల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
ఇరాన్ కే పూర్తి మద్దతు
అయితే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ ఇరాన్ పౌరులలో జాతీయ భావం చెక్కుచెదరలేదు. అమెరికా తక్షణమే ఈ యుద్ధాన్ని ముగించాలని వారు డిమాండ్ చేస్తూ.. తమ మాతృభూమిని విడిచిపెట్టి శాశ్వతంగా వేరే దేశాలకు వెళ్లే ఉద్దేశం లేదని వారు తెగేసి చెబుతున్నారు. అటు ఇరాక్ అధికారులు కూడా మానవీయ కోణంలో సరిహద్దుల వద్ద వీరికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.






