- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్మూజ్ పై వెనక్కి తగ్గిన ఇరాన్.. శత్రువులకు మాత్రం నో ఎంట్రీ!
హార్మూజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ బేఖాతరు చేసింది.

Iran FM says Strait of Hormuz closed to our enemies
దిశ, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిని నియంత్రించడం ద్వారా ఇరాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. లండన్‌లోని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO)లో ఇరాన్ సీనియర్ ప్రతినిధి అలీ మౌసావి (Ali Mousavi) అధికారికంగా ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన 48 గంటల డెడ్‌లైన్‌ను పట్టించుకునేది లేదని ఇరాన్ తెగేసి చెప్పింది. హర్మూజ్ జలసంధి తమ భూభాగంలో భాగమని, దానిపై నియంత్రణ తమ సార్వభౌమ హక్కు అని ఇరాన్ వాదిస్తోంది.
తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే "శత్రు దేశాల" నౌకలకు మినహా, మిగిలిన అన్ని వాణిజ్య, ఇతర దేశాల నౌకలకు జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణాన్ని కల్పిస్తామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమతో ముందస్తు కోఆర్డినేషన్ చేసుకోవడం తప్పనిసరి అని షరతు విధించింది. ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రం సమీపంలో ఇరాన మిసైల్ దాడులు చేసిన నేపథ్యంలో.. "హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరవాలి, లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా భీకర దాడులు చేస్తుంది" అని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికను ఇరాన్ బేఖాతరు చేస్తూ నేడు ప్రకటన జారీ చేసింది.
హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు వెన్నెముక వంటిది. ప్రపంచ చమురు సరఫరాలో 20-25% ఈ ఇరుకైన జలసంధి గుండానే వెళుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC Navy) నౌకలను ఇక్కడ భారీగా మొహరించింది. జలసంధిని పూర్తిగా మూసివేయకపోయినా, తనిఖీలు మరియు నియంత్రణలను తీవ్రం చేసింది. దీని ప్రభావం ప్రపంచ ఆయిల్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాయి. పర్షియన్ గల్ఫ్ రూట్‌కు బదులుగా ఆఫ్రికా చుట్టూ ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good Hope) ద్వారా తమ నౌకలను మళ్లిస్తున్నాయి.
దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు 300-500% మేర భారీగా పెరిగాయి. మరోవైపు బహ్రైన్‌లో ఉన్న అమెరికా 5వ ఫ్లీట్, ఇజ్రాయెల్ నావికాదళం హై అలర్ట్‌లో ఉన్నాయి. ట్రంప్ ఇచ్చిన 48 గంటల సమయం ముగుస్తున్న కొద్దీ, పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం ముంచుకొస్తోందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.






