2021-22లో 33 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

by Dishanational2 |
2021-22లో 33 శాతం పెరిగిన బంగారం దిగుమతులు
X

న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో 33.34 శాతం పెరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉండటంతో 2021-22లో భారత బంగారం దిగుమతులు 46.14 బిలియన్ డాలర్లు(రూ. 3.50 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 34.62 బిలియన్ డాలరు(రూ. 2.62 లక్షల కోట్లు)గా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు పెరగడం మూలంగా వాణిజ్య లోటు అంతకుముందు కంటే మెరుగ్గా 192.41 బిలియన్ డాలర్ల(రూ. 14.6 లక్షల కోట్ల)కు చేరుకుంది. చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్‌లో ఎక్కువగా ఆభరణాల పరిశ్రమ బంగారం దిగుమతులను చేసుకుంటుంది. ఈ క్రమంలోనే 2021-22లో రత్నాభరణాల ఎగుమతులు ఏకంగా 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్ల(రూ. 2.96 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఇక, అధికారిక గణాంకాల ప్రకారం.. 2021, ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 842.28 టన్నుల బంగారం దిగుమతులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కారణంగా దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటుపై మరింత ఒత్తిడికి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed