సిరిసిల్లలో కేటీఆర్‌కు చిక్కులు.. రంగంలోకి మేనబావ

by Disha Web Desk 4 |
సిరిసిల్లలో కేటీఆర్‌కు చిక్కులు.. రంగంలోకి మేనబావ
X

దిశ, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. మున్సిపల్ చైర్మన్​ పదవితో సమానంగా ఈ బ్యాంకు చైర్మన్ పోస్టుకు ప్రాధాన్యత ఇస్తారు. క్యాంపు రాజకీయాలు జరిపి రూ.కోట్లు ఖర్చుపెట్టి సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పగ్గాలను చేపట్టేందుకు రాజకీయ పార్టీలు, ప్రముఖులు పోటీ పడుతుంటారు. ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రత్యేక శ్రద్ద చూపి తమ పార్టీ కేడర్ నే గెలిపించుకుంటారు. 2019లో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్యానల్ భారీగా దెబ్బతింది. టీఆర్ఎస్ నేతల సమన్వయ లోపంతో ఇతరులు గెలిచినా..మంత్రి కేటీఆర్ ఇలాకాలో పరువు పోతుందనే సిరిసిల్ల టీఆర్ఎస్ ముఖ్యులు డైరక్టర్లను బలవంతంగా క్యాంపులకు తరలించి సిరిసిల్ల అర్బన్ బ్యాంకుపై టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కేటీఆర్ మేనబావ చీటీ నర్సింగరావ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టనాధ్యక్షులు జిందం చక్రపాణి, బొల్లి రాంమోహన్, మంచె శ్రీనివాస్ లాంటి ప్రముఖులు కష్టపడి సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్ గా చేసిన ప్రముఖ వ్యాపారవేత్త గాజుల నారయణకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. దీంతో సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ కు తెలియకుండా ఏం జరగదు అన్న మాటకు అర్థం లేకుండా పోయిందన్న చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఫుల్ సపోర్ట్ ఉన్న గాజుల నారాయణపై మంత్రి కేటీఆర్ కు ఏ మాత్రం సమాచారం లేకుండా డీసీవోకు డైరక్టర్లు అవిశ్వాస నోటీస్ ఇవ్వడం, అవిశ్వాసం తేదీ ఖరారు చేయడం ఇట్టే జరిగిపోయింది. దీంతో సిరిసిల్లలో ఈ అవిశ్వాసంపై రాజకీయ దుమారం చెలరేగింది.

కేటీఆర్ ఇలాకాలో కేటీఆర్ కు తెలియకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందిన అర్బన్ బ్యాంకు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం తీవ్ర చర్చనీయంశంగా మారింది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఓ టీం పని చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల తర్వాత రెండు సామాజిక వర్గాల నేతల మధ్య పెరిగిన దూరం..ఒకరిపై ఒకరు రాజకీయ పెత్తనం చెలాయించుకోవాలన్న ఆలోచనతోనే ఇటువంటి చర్యలకు తెరవెనక కుట్రలు చేస్తున్నట్లు పార్టీలోని తటస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ గా గూడూరి ప్రవీణ్ కు కేటీఆర్ నామినేట్ చేసి..ప్రభుత్వ ఉత్వర్వులు జారీచేశారు. టీఆర్ఎస్ నేతలే ప్రతిపక్ష పార్టీ వారితో కలసి కోర్టు స్టే ఇప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అర్బన్ బ్యాంకు అవిశ్వాసం వెనక కూడా టీఆర్ఎస్ ప్రముఖులే ఉన్నారన్న అపవాదు మూటగట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.



తాజాగా సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గంలో చీలికలు తీసుకువచ్చి విబేధాలు సృష్టిస్తున్నారన్న విమర్శలు సిరిసిల్లలో చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలనే టార్గెట్ చేస్తూ పదవీచుత్యులను చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై సిరిసిల్లలో ఆ సామాజిక వర్గ ప్రముఖులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని సీరియస్ గా చర్చించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేటీఆర్ తన సొంత నియోకవర్గంపై దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య విబేదాలు చోటు చేసుకోవడంతో గ్రూపు రాజకీయాలు పునరావృత్తం అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ వెనక పార్టీలోనే వ్యతిరేక వర్గం రాజకీయ గొయ్యి తీయ్యడం ప్రారంభం అయ్యిందన్న చర్చ కొనసాగుతోంది. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు అవిశ్వాసం సోమవారం ఉండటంతో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కేటీఆర్ మేనబావ చీటీ నర్సింగరావ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి శనివారం అర్థ రాత్రి వరకూ కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపారు. అర్బన్ బ్యాంకు పాలకవర్గంలో చోటు చేసుకున్న విబేధాలు చర్చించి చైర్మన్ గాజుల నారాయణకు డైరక్టర్లకు సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముగ్గురు డైరక్టర్లు హజరుకాకపోవడంతో రేపు జరిగే అవిశ్వాసం వీగుతుందా..? నెగ్గుతుందా అన్నది అంతుచిక్కడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం వీగిపోయేలా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ సిరిసిల్ల అర్బన్ బ్యాంకు అవిశ్వాసం నెగ్గితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాలకు, సింగిల్విండో చైర్మన్, వైస్ చైర్మన్లకు ఇతర స్థానిక సంస్థల్లో కూడా ఈ అవిశ్వాసం ముప్పు ప్రారంభం అవుతుందని, డబ్బుల కోసం చైర్మన్లను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు అవిశ్వాసం నెగ్గుతందా వీగుతుందా వేచి చూడాలి.



Next Story

Most Viewed