ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం ఆగ్రహం

by Malleboina Mahesh |

మేడారంలో అమ్మవార్ల దర్శనం సందర్భంగా తలెత్తిన వివాదం లో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సీపీ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: మేడారంలో అమ్మవార్ల దర్శనం సందర్భంగా తలెత్తిన వివాదం లో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సీపీ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. డ్యూటీలో ఉన్న ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న ఒక ఉన్నతాధికారిని మతం పేరుతో దూషించడం, వ్యక్తిగత విమర్శలు చేయడం అత్యంత అభ్యంతరకరమని IFS సంఘం పేర్కొంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని సంఘం స్పష్టం చేసింది.

నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ఆలిండియా సర్వీస్ అధికారుల గౌరవం, సమగ్రత, స్వతంత్రత పై దాడి చేయడమేనని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మతాలను ప్రస్తావిస్తూ అధికారులను లక్ష్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికింది. ఇలాంటి ధోరణి అధికారుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సంఘం హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ బహిరంగంగా, బేషరతుగా ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. అధికారుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో తామంతా ఏకతాటిపై ఉంటామని ఈ సందర్భంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంఘం ప్రకటించింది.

Next Story