మట్కా ఆపేదేలే.. ఎవరెన్ని వార్నింగ్ ఇచ్చినా ఆట నడిపిస్తా!

by Jakkula.Mamatha |

మట్కాను ఆపేదేలే అని, ఎవరెన్ని వార్నింగ్‌లు ఇచ్చినా ఆటను కొనసాగిస్తామని ఓ బుకీ తన సన్నిహితులతో బీరాలుకుతున్నట్లు సమాచారం.

మట్కా ఆపేదేలే.. ఎవరెన్ని వార్నింగ్ ఇచ్చినా ఆట నడిపిస్తా!
X

‘మట్కాను ఆపేదేలే అని, ఎవరెన్ని వార్నింగ్‌లు ఇచ్చినా ఆటను కొనసాగిస్తామని ఓ బుకీ తన సన్నిహితులతో బీరాలుకుతున్నట్లు సమాచారం. ‘పోలీస్ కేసులతో పనేముంది.. స్టేషన్ పోయోస్తా.. రెండు కేసులే ఉన్నాయి మళ్లీ కొనసాగించడం మనకు మాములే అంటూ ఏజెంట్లకు ధైర్యవచనాలు నూరి పోస్తూ తన బ్రాకెట్ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పథకాలు వేస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న మట్కాను నియంత్రించడంలో, బుకీలను, ఏజెంట్లను పట్టుకోవడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించారా అనే విషయమై అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. బుకీలు ఏరియా వారీగా పంచుకొని ప్రతి నెలా కిందిస్థాయి సిబ్బందికి మామూళ్ళు ఇచ్చి పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా మేనేజ్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: పేద, మధ్యతరగతి, యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న మట్కాను భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అధికారిక ఆటగా ప్రభుత్వమేమైనా ప్రకటించిందా..? పక్కనే ఆనుకుని ఉన్న ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఈ మట్కా నెంబర్ గేమ్ పై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వాధికారులు, ఈ జిల్లాలో నిఘా పెట్టి అరికట్టడం సాధ్యం కావడం లేదా..? ఈ జిల్లాకు ఏమైన బ్రాకెట్ నిర్వహణకు ప్రత్యేకంగా అధికారులు అనధికార అనుమతులు ఇచ్చారా..? లేకుంటే ఏయే సెంటర్లలో ఆడుతున్నారో తెలుసుకోవడంలో విఫలమయ్యారా..? ఏజెంట్లపై, బుకీలపై నిఘా పెట్టి అరికట్టాల్సిన అధికారులు ఆడుకుంటే ఆడుకున్నారు.

మనకేంటి? మనం ఏజెంట్లను, బుకీలను నియంత్రించలేము అని చేతులెత్తేశారా? బుకీలు ఏరియా వారీగా పంచుకొని ప్రతి నెలా కిందిస్థాయి సిబ్బందికి మామూళ్ళు ఇచ్చి పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా మేనేజ్ చేస్తున్నారా? గంజాయి, డ్రగ్స్, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు రవాణా చేసేవారిపై 24 గంటలు నిఘా వేసి చాకచక్యంగా పట్టుకొని రాష్ట్రస్థాయిలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని శెభాష్...! అనిపించుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం ఈ మట్కాను నియంత్రించడంలో, బుకీలను, ఏజెంట్లను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించారా అనేది అర్ధం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది.

బుకీ బీరాలు..

మట్కాను ఆపేదేలే.. మట్కా ఆటలో అడ్డదారిలో అక్రమంగా భారీగా కూడబెట్టిన ఆస్తులతో వచ్చిన పొగరుతో ఓ బుకీ తన సన్నిహితులతో ఛాలెంజ్ చేస్తూ, ఎవరెన్ని వార్నింగ్ లు ఇచ్చినా ఆటను ఆపేదే లేదు అంటూ బీరాలుపలుకుతున్నట్లు సమాచారం. అస్త్రశస్త్రాలు వినియోగించి నిరంతరాయంగా మట్కాను నడపడమే లక్ష్యంగా పనిచేస్తానని, ఇప్పటికే పదిహేనేళ్ళు గడిచాయి, ఇప్పటి వరకు నెలనెలా, పండుగలప్పుడు అందరికీ తాయిలాలు ఇచ్చి మేనేజ్ చేసినా కొత్తగా చేసేదేముంది కొంచెం ఎక్కువ ఇద్దాం.. అంటూ గొప్పలకు పోతున్నాడు. ఏజెంట్లకు జాగ్రత్తలు కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ కేసులతో పనేముంది.. స్టేషన్ పోయోస్తా.. రెండు కేసులే కదా ఉన్నాయి. మళ్ళీ కొనసాగించడం మనకు మామూలే కదా.. మహా అయితే ఓ చిన్న కేసు అంతే కదా.. అంటూ ఏజెంట్లకు ధైర్యవచనాలు నూరి పోస్తూ తన బ్రాకెట్ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పథకాలు వేస్తున్నాడు. ఇకపై మట్కా ఆడేవారి నుంచి నగదు రూపేణా కంటే డిజిటల్ లావాదేవీల ద్వారా ఎక్కువ బిజినెస్ చేయాలని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక రాజకీయనాయకుల అండదండతో పాటు ఓ కార్పోరేటర్ బంధువు అండగా ఉన్నారని మట్కాను ఎట్టిపరిస్థితుల్లోను ఆగకుండా కొనసాగిస్తానని ఏజెంట్లు, తన సన్నిహితుల ముందు శపథం చేస్తున్నట్లు సమాచారం.

బుకీలపై, ఎజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి:కొదమసింహం పాండు రంగాచార్యులు(సామాజికవేత్త)

యువతకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన రావడం మంచి పరిణామం కాదు. అలాగే మధ్య తరగతి కుటుంబాలు మట్కాకు బానిస కావొద్దు, ఈ బ్రాకెట్ ఆటకు బానిస అయి కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారు. మట్కా ఆటను ఆడిస్తున బుకీలపై, ఏజెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాంగం తులచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

బుకీలపై ఆరా తీస్తున్నాం:పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారి

'దిశ' దినపత్రికలో వచ్చిన కథనంపై పోలీస్ స్పెషల్ బ్రాంచి అధికారి మాట్లాడుతూ మట్కా నిర్వహిస్తున్న బుకీల పై ఆరా తీస్తున్నామని, ఏజెంట్లు, బుకీలపై ప్రత్యేక నిఘా పెడతామని, ఈ అంశంపై విచారణ చేపట్టి రెండు రోజుల్లోగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారికి నివేదిక అందజేస్తామని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారి ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పారు. అసాంఘిక , అక్రమ కార్యకలాపాలు చేసేవారిని వదిలిపెట్టం. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story