- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను కాకినే... నాకూ బట్టతల వస్తుంది
మన పరిసరాల్లో ప్రతిరోజూ కనిపించే కాకి ప్రకృతిలో ఒక ముఖ్యమైన పక్షి. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కాకుల పాత్ర ఎంతో కీలకం.

దిశ, జడ్చర్ల : మన పరిసరాల్లో ప్రతిరోజూ కనిపించే కాకి ప్రకృతిలో ఒక ముఖ్యమైన పక్షి. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కాకుల పాత్ర ఎంతో కీలకం. సాధారణంగా కాకులు నలుపు లేదా నలుపు-బూడిద రంగులో కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో తల లేదా మెడ భాగంలో ఈకలు లేకుండా బట్టతలతో కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాంటి బట్టతల కలిగిన ఓ కాకి సోమవారం సాయంత్రం జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో దర్శనమివ్వడంతో సందర్శకులను ఆకట్టుకుంది. ఈ తరహా కాకులను చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతుంటారని, కొందరు దీనిని అపశకునంగా భావించినప్పటికీ, దీనికి పూర్తిగా శాస్త్రీయ కారణాలే ఉన్నాయని గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, కాకుల్లో బట్టతల కనిపించడానికి ప్రధాన కారణం ఈకల మార్పిడి (Molting). పక్షులన్నింటిలోనూ పాత ఈకలు రాలిపోయి వాటి స్థానంలో కొత్త ఈకలు పెరిగే సహజ ప్రక్రియ ఇది. ఈ సమయంలో కొద్ది రోజులపాటు తల లేదా మెడ భాగం బట్టతలగా కనిపించవచ్చు. కొత్త ఈకలు పూర్తిగా పెరిగిన అనంతరం అవి మళ్లీ సాధారణ రూపాన్ని సంతరించుకుంటాయని తెలిపారు. అలాగే కొన్ని సందర్భాల్లో పరాన్నజీవులు, శిలీంధ్రాలు లేదా వైరస్‌ల కారణంగా కూడా ఈకలు రాలిపోవచ్చన్నారు. ముఖ్యంగా ఏవియన్ పాక్స్ (Avian Pox) వంటి వైరస్ వ్యాధులు సోకినప్పుడు తలపై గడ్డలు, పుండ్లు ఏర్పడి ఈకలు ఊడిపోవచ్చని చెప్పారు. ఇవేకాకుండా పోషకాహార లోపం, పర్యావరణ కాలుష్యం, ఇతర కాకులతో జరిగే పోరాటాలు, గాయాలు, అలాగే ఒత్తిడి వంటి కారణాలు కూడా కాకుల్లో బట్టతలకు దారితీయవచ్చని డా. సదాశివయ్య వివరించారు. అపశకునంగా భావించకుండా ప్రకృతిలో సహజంగా జరిగే మార్పులను శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.






