- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ఒకేరోజు రెండు చోట్ల ఆక్రమణలను తొలగించిన హైడ్రా
హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్రమణలను తొలగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్రమణలను తొలగించింది. గచ్చిబౌలి ప్రాంతంలో పార్కును కాపాడగా.. శామీర్‌పేటలో రోడ్డు ఆక్రమణలను తొలగించి అక్కడి నివాసితులకు దారి చూపింది. ఈ రెండు ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే ఔట్ వేశారు. ఇందులో 4వేల గజాలు పార్కుకోసం కేటాయించారు. ఇందులో 1500ల గజాల వరకూ ఆక్రమణలు జరిగిపోయాయి. నివాసాలు కూడా వచ్చాయి. మిగిలిన 2500ల గజాల స్థలంలో కూడా ప్లాట్లున్నాయంటూ కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. దీంతో టెలికామ్ నగర్ నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. 4 వేల గజాలు పార్కుకు కేటాయించినట్టు నిర్ధారణ అయ్యింది. ఇందులో ఇప్పటికే నివాసాలు రాగా.. వాటిని మినహాయించి మిగిలిన 2500ల గజాల పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగించి.. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
శామీర్‌పేటలో రోడ్డు ఆక్రమణల తొలగింపు...
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేటలోని ఫ్రెండ్స్ కాలనీలో రోడ్డు ఆక్రమణలను హైడ్రా గురువారం తొలగించింది. సర్వే నంబరు 1198లో 4.20 ఎకరాల పరిధిలో ఫ్రెండ్స్ కాలనీ పేరిట 1987వ సంవత్సరం లే ఔట్ వేశారు. ఇందులో 20 ఫీట్ల రహదారిని ఆక్రమించి గోడలు నిర్మించారు. గేటు కూడా ఏర్పాటు చేసి పక్కనే ఉన్న ప్లాట్లలోకి కలిపేశారు. శామీర్‌పేట పోలీసు స్టేషన్ మీదుగా వెళ్లే దారి బందయ్యిందంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందగా... క్షేత్రస్థాయిలో విచారించి రోడ్డు ఆక్రమణను హైడ్రా నిర్ధారించుకుంది. గురువారం రోడ్డు ఆక్రమణలను తొలగించి.. కాలనీ వాసులకు హైడ్రా దారి చూపింది. 15 ఏళ్లుగా తాము సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశామని.. ఇప్పటికి హైడ్రా చొరవతో తమకు దారి దొరికిందని స్థానికులు సంతోషం వ్యక్తంచేశారు.






