మయన్మార్‌లో లభ్యమైన భారీ కెంపు.. ఏకంగా 2.2 కిలోలు

by Muthe.Rajitha |

మయన్మార్‌లో మరోసారి అతిభారీ 'కెంపు' లభ్యమైంది.

మయన్మార్‌లో లభ్యమైన భారీ కెంపు.. ఏకంగా 2.2 కిలోలు
X

దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్‌లో మరోసారి అతిభారీ 'కెంపు' లభ్యమైంది. మొగాక్ మైనింగ్ ప్రాంతంలో 11 వేల క్యారెట్ల బరువున్న భారీ కెంపు లభించడం రత్నాల ప్రపంచంలోనే ఒక సంచలనంగా మారింది. సుమారు 2.2 కిలోల బరువున్న ఈ అరుదైన రత్నాన్ని మండలే నగర సమీపంలో గుర్తించారు. సాధారణంగా కెంపులు (Rubies) కొన్ని క్యారెట్ల బరువులోనే లభిస్తుంటాయి. అలాంటిది వేల క్యారెట్ల బరువుతో, అది కూడా నాణ్యతకు మారుపేరైన మయన్మార్ రత్నాల మైన్స్ దొరకడం అంతర్జాతీయ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొగాక్ ప్రాంతంలో లభించే కెంపులకు ఉండే "పావురం రక్తం" (Pigeon's Blood) వంటి ఎరుపు రంగు మరెక్కడా దొరకదు, అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంటుంది.

అయితే మయన్మార్ లోని ఈ "కెంపుల లోయ" (Valley of Rubies) గతంలోనూ అనేక భారీ విలువైన కెంపులు, రత్నాలు లభించాయి. 1996లో లభించిన 21,450 క్యారెట్ల కెంపు పరిమాణంలో పెద్దదైనప్పటికీ, ప్రస్తుతం లభించిన 11 వేల క్యారెట్ల రత్నం నాణ్యత పరంగా అంతకంటే విలువైనది కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో కేవలం 25.59 క్యారెట్ల బరువున్న 'సన్‌రైజ్ రూబీ' వేలంలో దాదాపు 286 కోట్ల రూపాయలు పలికిందంటే, ఈ భారీ రత్నం విలువ ఊహకు అందనంతగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story