జూపార్క్ సమీపంలో భారీ మంటలు.. భయంతో హడలెత్తిన జంతువులు

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని బహదూర్‌పురాలో నెహ్రూ జూపార్క్ సమీపంలోని ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

జూపార్క్ సమీపంలో భారీ మంటలు.. భయంతో హడలెత్తిన జంతువులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో నెహ్రూ జూపార్క్ సమీపంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక స్క్రాప్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో దుకాణం నుండి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్క్రాప్ దుకాణంలో భారీగా ప్లాస్టిక్, రబ్బర్ మరియు పాత మెటల్ వస్తువులు నిల్వ ఉండటంతో మంటలు చాలా వేగంగా విస్తరించాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు, ఇతర వ్యాపార సంస్థలకు వ్యాపించకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారికంగా సమాచారం అందలేదు దుకాణం పూర్తిగా దగ్ధమవ్వడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అగ్నిమాపక చర్యలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కాగా జూపార్కుకు అత్యంత సమీపంలో భారీగా మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడం, ఫైర్ ఇంజన్ల మోతతో జూపార్కులోని జంతువులు హడలిపోయే ప్రమాదం ఉందని జు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Next Story