దేశవ్యాప్తంగా 'డైపర్ బ్యాంక్స్'

by Disha Web Desk 12 |
దేశవ్యాప్తంగా డైపర్ బ్యాంక్స్
X

దిశ, ఫీచర్స్ : చంటి పిల్లలకు 'డైపర్స్' ఉపయోగించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఇది ఆధునికంగా సంతరించిన అలవాటేం కాదని, పురాతన కాలంలోనూ ఈ రూపాలను ఉపయోగించారని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. కీటకాలు, చీమలు, ఇతర సూక్ష్మక్రిముల నుంచి చిన్నారులను సంరక్షించుకునేందుకు మిల్క్‌వీడ్ లీఫ్, జంతు చర్మాలు, నాచు, నారలు తదితర సహజ వనరులను చుట్టేవాళ్లు. ఈ క్రమంలోనే క్వీన్ ఎలిజబెత్-1 హయాంలో మొదటిసారిగా క్లాత్ డైపర్స్ వినియోగంలోకి రాగా.. 19వ శతాబ్దంలో ప్రస్తుత నమూనాలో డైపర్లు రూపొందాయి.

కాగా 20వ శతాబ్దం చివరన ఇండియన్ మార్కె్ట్‌లోకి డైపర్లు ప్రవేశించాయి. ఇక మహిళలు సైతం ఉద్యోగాలకు వెళ్లడం ప్రారంభమైన తర్వాతే డైపర్ మార్కెట్‌ ఊపందుకుంది. కానీ సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 'డైపర్' ఖర్చు భరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వ్యాప్తంగా 'డైపర్ బ్యాంక్స్' పుట్టుకొచ్చాయి. ఆ విశేషాలేమిటో చూద్దాం.

ఆకలితో అలమటించే పేదలకు 'ఫుడ్ బ్యాంక్స్' సాయపడినట్లే.. అవసరమైన కుటుంబాలకు డైపర్స్ పంపిణీ చేసేందుకు 'డైపర్ బ్యాంక్స్' ఉపయోగపడతాయి. 1994లో 'డైపర్ బ్యాంక్ ఆఫ్ సదరన్ అరిజోనా' పేరుతో తొలి డైపర్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో డైపర్స్, పీరియడ్ ప్రొడక్ట్స్ ప్రాథమిక అవసరాలు గా మారిపోయాయి. ప్రస్తుతం ఒక్కో డైపర్ ధర 10 రూపాయలకు మించి ఉండగా.. చిన్నారులకు ఒక్కో రోజు రెండు కూడా వాడాల్సి రావచ్చు. ఈ మేరకు ఒక్కో కుటుంబం డైపర్స్ కోసం నెలకు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన ఏడాదికి పన్నెండు వేలకు పైగా ఖర్చవుతోంది. అదే అమెరికాలో అయితే సగటున 75 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది భారంగా పరిణమించడంతో 'డైపర్ బ్యాంక్స్' పుట్టుకొచ్చాయి.

200కు పైగా ..

అల్ప ఆదాయ కుటుంబాలకు ఉచిత డైపర్స్ అందించే 'డైపర్ బ్యాంక్స్'.. వాటి ఆవశ్యకత పైన ఆయా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తాయి. యూఎస్ చుట్టుపక్కల ప్రస్తుతం 200కు పైగా డైపర్ బ్యాంక్స్ అందుబాటులో ఉండగా.. చర్చి లేదా కమ్యూనిటీ సెంటర్‌లోని చిన్న ప్యాంట్రీ లేదా డైపర్ క్లోసెట్ స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తుంటారు. పేదల అవసరాలను తీర్చే విషయమై మరికొన్ని చారిటీ సంస్థలు, ఎన్‌జీవోలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. నిజానికి ఇది చిన్న సాయమే కావచ్చు కానీ దీని వల్ల ఆయా కుటుంబాలకు చెందిన వ్యక్తులు పని ప్రదేశాల్లో నిరభ్యంతరంగా పనిచేసుకునే అవకాశం ఉంది.

పీరియడ్ బ్యాంక్ సేవలు..

శిశువులకు డైపర్లు ప్రాథమిక అవసరం కాగా.. మహిళలకు 'ప్యాడ్స్' అంతే ఆవశ్యకమైనవి. అయితే ఇంటి ఖర్చులు, అవసరాలు, ఆర్థిక వెనకబాటుతనం మూలంగా పీరియడ్ సామగ్రిని కొనుగోలు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఫర్ పీరియడ్ సప్లైస్ ప్రకారం.. నెలసరి అనుభవిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు 'ప్యాడ్స్' కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక డైపర్ బ్యాంక్స్.. పీరియడ్ సప్లయ్ బ్యాంక్స్‌గా మారాయి. అయితే ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో మద్యం, సిగరెట్ వంటి వస్తువులతో పాటు డైపర్స్, పీరియడ్ ఉత్పత్తులను లగ్జరీ ఐటెమ్స్‌గా గుర్తిస్తూ అధిక పన్ను విధిస్తున్నారు.

దీన్ని తగ్గించేందుకు డైపర్, పీరియడ్ సప్లై బ్యాంకర్స్ విశేషంగా కృషి చేస్తున్నాయి.మనదేశంలోనూ డైపర్ బ్యాంక్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉందని, పట్టణ పేదరికం లో పెరుగుతున్న లక్షలాది మంది పిల్లలకు డైపర్స్ ఉచితంగా అందివ్వాలని సామాజికవాదులు అభిప్రాయపడుతున్నారు. ఫౌంటైన్స్, పార్కులు, విగ్రహాలు, సుందరీకరణ పనులకు ఖర్చు చేసే వనరులను పేద పిల్లలకు అవసరమైన కార్యక్రమాలకు ఉపయోగించాలని సూచిస్తున్నారు. దేశంలో పదిలక్షలకు పైగా అంగన్‌వాడీలు ఉండగా.. వాటిని కూడా డైపర్ బ్యాంక్స్‌గా మలచుకోవచ్చని అంటున్నారు.

11 ఏళ్ల నుంచి 'మామ్స్ హెల్పింగ్ మామ్స్ ఫౌండేషన్' ద్వారా డైపర్, బేబీ సప్లయ్ బ్యాంక్‌ నడుపుతున్నాను. కొన్నేళ్ల కిందటి వరకు 'డైపర్ బ్యాంక్' అంటే ఏంటో కూడా తెలియదు. నాకు తెలిసిందల్లా అవసరమున్న కుటుంబాలు, ఇతరులకు సాయం చేయడమే. ఆ తర్వాత డైపర్ బ్యాంక్స్ గురించి తెలుసుకొని వాటి ద్వారా మరింత మందికి చేరువయ్యాం. మా తరపున డైపర్ డ్రైవ్స్ హోస్ట్ చేస్తుంటాం. ఇక దేశవ్యాప్తంగా ఉన్న డైపర్ బ్యాంక్‌లన్నీ కలిసి ప్రతీ ఏట సెప్టెంబరులో కమ్యూనిటీ వైడ్ డైపర్ డ్రైవ్‌లను హోస్ట్ చేయడం ద్వారా డైపర్ నీడ్ అవేర్‌నెస్ వీక్‌ను పాటిస్తాయి.

మేగాన్ డీటన్, ఫౌండర్, మామ్స్ హెల్పింగ్ మామ్స్ ఫౌండేషన్

Next Story