- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్.. ప్రయాణికులకు చుక్కలు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై శుక్రవారం తెల్లవారుజాము వరకు ట్రాఫిక్ చుక్కలు చూపించింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై శుక్రవారం తెల్లవారుజాము వరకు ట్రాఫిక్ చుక్కలు చూపించింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో వాహనాల రద్దీ ఊహించని స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి నుంచే ప్రైవేటు కార్లు, ట్రావెల్స్ బస్సులు, ద్విచక్ర వాహనాలతో రహదారి మొత్తం కిక్కిరిసిపోయింది. సాధారణంగానే సెలవుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మార్గంలో, గురువారం రాత్రి 10 గంటల సమయం నుండి వాహనాల రాకపోకలు అసాధారణంగా పెరిగిపోయి ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.
సీఎం సభ.. మరిన్ని ట్రాఫిక్ చిక్కులు
దీనికి తోడు, ఖమ్మం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 'రైతు ఆశీర్వాద సభ' ఈ భారీ ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణగా మారింది. ఈ బహిరంగ సభకు జనాలను తరలించేందుకు హైదరాబాద్ నగరంలోని వివిధ డిపోల నుండి వందలాది తెలంగాణ ఆర్టీసీ (TSRTC) బస్సులను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ వందల సంఖ్యలోని ఆర్టీసీ బస్సులు ఒకేసారి హైదరాబాద్ నుంచి పంతంగి టోల్‌ప్లాజా మీదుగా ఖమ్మం జిల్లా వైపు బయలుదేరాయి. అప్పటికే సాధారణ ప్రయాణికుల వాహనాలతో నిండిపోయిన హైవేపై, ఈ ఆర్టీసీ బస్సులు కూడా తోడవడంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద పరిస్థితి పూర్తిగా చే దాటిపోయింది. టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లింపుల కోసం వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మరింత ఘోరంగా జామ్ అయింది.
కిలోమీటర్ల మేర ఆగిన వాహనాలు
దీని ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా నుండి అంకిరెడ్డిగూడెంలోని దివిస్ పరిశ్రమ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. అర్ధరాత్రి వేళ చిన్న పిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్న వారు నానా ఇబ్బందులు పడ్డారు. కనీసం వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి నెలకొనడంతో, ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే వేచి చూడాల్సి వచ్చింది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ వాహనాల రద్దీ మరియు ట్రాఫిక్ ఇబ్బందులు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నిరంతరాయంగా కొనసాగాయి. సెలవుల సమయంలో ముందస్తు ప్రణాళికలు, అదనపు టోల్ కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు పదే పదే పునరావృతమవుతున్నాయని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.






