- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్ర, కేరళం సహా పలు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన : IMD
దేశంలోని మహారాష్ట్ర, కేరళం సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళం సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారిక వెబ్‌సైట్ (internal.imd.gov.in) ద్వారా వెల్లడించింది. రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో ముంచుకొస్తున్న వరద ముప్పు దృష్ట్యా ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అత్యంత భారీ వర్షాలు – ‘రెడ్ అలర్ట్’ జారీ
ఐఎండీ సూచనల ప్రకారం.. కొన్ని రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేరళ, కర్ణాటక, గుజరాత్, కోంకణ్ & గోవా, మధ్య మహారాష్ట్ర, అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం & మేఘాలయ ప్రాంతాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాల వల్ల భారీ వరదలు ముంచెత్తడమే కాకుండా కొండచరియలు విరిగి పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఉప్పొంగే వరదల వల్ల రోడ్లు, వంతెనలు తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు – ‘ఆరెంజ్ అలర్ట్’
ఉత్తరాఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడమే కాకుండా.. నదులు, చెరువులు ఉప్పొంగే అవకాశం ఉందని తెలిపింది. వీటితో పాటు సబ్-హిమాలయన్ వెస్ట్ బెంగాల్ అనగా పశ్చిమ బెంగాల్ కొండ ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
నదులను తలపిస్తున్న నగరాలు
గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దేశంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాలు గ్రామాలు ఇప్పటికే ఈ వర్షాల ధాటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే, తలేగావ్ దభాడే వంటి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్ లోని సూరత్ నగరంలో భారీ వరదలు సంభవించాయి. ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కేరళ & కర్ణాటకలో నదులు, చెరువులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ల్యాండ్‌స్లైడ్లు జరిగి రాకపోకలు నిలిచిపోయాయి. వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించగా.. ఏడుగురు గల్లంతయ్యారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వరద ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటించాలని ఐఎండీ స్పష్టం చేసింది.






