- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులు బెటర్ : డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) మావోయిస్టుల(Maoists)పై సంచలన వ్యాఖ్యలు చేసారు. సమాజంలో ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లు సృష్టిస్తున్న అలజడితో పోల్చుకుంటే, ఒకప్పటి మావోయిస్టులే బెటర్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం పోలీసు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పిల్లల ప్రాణాలతో చెలగాటం
గంజాయి స్మగ్లర్ల దారుణాలను ఎండగడుతూ.. ప్రస్తుత రోజుల్లో స్మగ్లర్లు చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్నారని డీజీపీ మండిపడ్డారు. స్కూళ్లు, కాలేజీల పిల్లలకు చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను తినిపిస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని పీడిస్తున్న ఇటువంటి ముఠాల కంటే మావోయిస్టులే ఎంతో నయమని ఆయన అభిప్రాయపడ్డారు.
డ్రగ్స్‌ను వ్యతిరేకించిన మావోయిస్టులు
గతాన్ని గుర్తుచేసుకుంటూ.. ఇంతక ముందు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పుడు వారు గంజాయి సాగును, డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. వారి భయంతో అప్పట్లో స్మగ్లర్లు అడవుల్లోకి అడుగుపెట్టడానికి సాహసించేవారు కాదన్నారు. అయితే, ప్రస్తుతం పోలీస్ నిఘా, ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయిందని, కానీ దీనిని ఆసరాగా చేసుకుని స్మగ్లర్లు మళ్లీ రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాలలో ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారని తెలిపారు.
గ్రేహౌండ్స్ అలర్ట్
గతంతో పోలిస్తే ఇప్పుడు గంజాయి సాగు భారీగా పెరిగిపోవడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి స్మగ్లింగ్ కేసులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయని డీజీపీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాను, సాగును అడ్డుకోవడానికి అటవీ ప్రాంతాల్లోని గ్రేహౌండ్స్ (Greyhounds) దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. గ్రేహౌండ్స్ బలగాలు అడవుల్లోని పరిస్థితిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ నిఘా పెంచాయని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల (Drugs) సరఫరాపై తెలంగాణ పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని, స్మగ్లర్ల ఆట కట్టిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.






