- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్‌ను వదిలిపెట్టేది లేదు.. హరీష్ రావు హెచ్చరిక
‘సిట్ నన్ను ప్రశ్నలు అడగడం కాదు.. నేనే పోలీసులను వందల ప్రశ్నలు అడిగా’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సిట్ నన్ను ప్రశ్నలు అడగడం కాదు.. నేనే పోలీసులను వందల ప్రశ్నలు అడిగా’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకేం సంబంధం. నేను అప్పుడైమైనా హోంమంత్రిగా పనిచేశానా’ అని నిలదీసినట్లు చెప్పారు. అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌లను విచారణకు పిలవాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇప్పటి డీజీపీ శివధర్ రెడ్డి అని.. అలాగే మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని సైతం విచారించాలని సూచించినట్లు తెలిపారు.
నిరాధార ఆరోపణలు.. సొల్లు పురాణాలు
రేవంత్‌రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా ఒక ట్రాష్ అని.. నిరాధార ఆరోపణలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం అని హరీశ్‌రావు విమర్శించారు. సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గంట అడగగానే అధికారులకు బయటి నుంచి ఫోన్లు వస్తాయని.. మల్లా గంట తరువాత వచ్చుడని.. ఫోన్లు వస్తే ముగ్గురు బయటికి పోయి వచ్చి మల్లా అడుగుడం చేశారని ఆరోపించారు. అడిగిందే అడగడం తప్ప కొత్తగా ఏం లేదని.. రేవంత్‌రెడ్డి ఫోన్ చేసిండో, సజ్జనార్ చేసిండో తెలియదని అన్నారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది బాగోతాన్ని పొద్దున బయటపెడితే సాయంత్రం తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. రేవంత్‌కు దమ్ముంటే, ధైర్యం ఉంటే, తప్పు చేయకుంటే సింగరేణి కుంభకోణంపై, రింగ్ కింగ్ అయిన మీ బామ్మర్ది సుజన్‌రెడ్డిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీ బామ్మర్దే మొదటి దోషి అని.. అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయన వల్లే ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి మధ్య కొట్లాట బయట పడిందన్నారు. టెండర్ల కోసం చేస్తున్న మోసం అంతా తెలుస్తున్నదని దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు.. లట్టు.. పొట్టు.. అని ఎద్దేవా చేశారు. ఎన్ని సిట్లు అయినా వేసుకున్నా.. తమకు ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు కొత్త కాదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాటు దేలిన సైనికులమని తెలిపారు. ఈ నోటీసులు తన ప్రజా పోరాటానికి దక్కిన గౌరవంగానే భావిస్తానని తెలిపారు. హామీలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని.. ఘోష్ కమిషన్ అంతా డొల్ల అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించానని.. ఇప్పుడు సింగరేణి బాగోతం బయట పెడితే సిట్ నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి స్కాంలకు తెగబడ్డారని ఆరోపించారు.
దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో..
రేవంత్.. పోలీసుల వెనుక దాక్కుని పిరికిపందలా నోటీసులు పంపడం కాదని.. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా తన గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుందని.. ప్రజల పక్షాన ఇంకా గట్టిగా పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిగా తాను ఏ విచారణకైనా వస్తానని తెలిపారు. ‘కాస్కో రేవంత్.. నేను కుంభకోణాలు కుండబద్దలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంట’ అని హెచ్చరించారు. లీకులు ఇవ్వడం కాదు.. దమ్ముంటే విచారణ మొత్తం రికార్డు బయట పెట్టాలని సవాల్ విసిరారు. చేతగాని వాడిలా లీకులు ఇచ్చి చిల్లర రాజకీయాలు చేయొద్దని సూచించారు. ‘నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు. నీ పతనానికి దోహదం చేస్తాయి. నోటీసులతో నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. చూస్కుందాం..’ అని సవాల్ విసిరారు. రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని.. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణంపై, అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తామని హెచ్చరించారు.
రేవంత్‌ను వదిలిపెట్టేది లేదు..
‘నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలి పెట్టం. నీ కుంభకోణాలు బయటపెడుతూనే ఉంటామని హరీశ్‌రావు హెచ్చరించారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్‌రెడ్డి’ అని అన్నారు. ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. తమకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నదని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా తాను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెంపచెల్లుమనేలా సమాధానం చెప్పిందని.. అయినా కొత్త నాటకాలకు తెరలేపారని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతారని ప్రశ్నించారు. అంతకుముందు కోకాపేటలోని హరీశ్‌రావు నివాసం వద్ద మాట్లాడారు. బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని.. దండుపాళ్యం ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టానని తెలిపారు. ఆరు గ్యారెంటీలు, హిల్ట్ పీ, పవర్ స్కాం, భూ కుంభకోణాలు బయటపెట్టామని, వాటాల విషయం ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. తమకు నోటీసులు ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నారని.. బీఆర్ఎస్ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. సర్పంచు ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి అంచనాలు తప్పాయని.. మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అంటున్నారని ఆరోపించారు. ఇక నుంచి ఆంధ్రాకు అమ్ముడు పోయిన దానిపై నిలదీస్తూనే ఉంటామని చెప్పారు. బొగ్గు స్కాంపై తాను కిషన్‌రెడ్డికి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యింది నిజం కాకుంటే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. నైనీ బ్లాక్ ఒక్కటే కాదు, అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని అన్నారు.






