‘దమ్ముంటే రాజకీయంగా రా చూసుకుందాం’: CM రేవంత్‌కు హరీష్ రావు సవాల్

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘దమ్ముంటే రాజకీయంగా రా చూసుకుందాం’: CM రేవంత్‌కు హరీష్ రావు సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణ అనంతరం బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని. నిఖార్సైన ఉద్యమకారుడిని. ఇలాంటి విచారణలకు భయపడను. ఉద్యమంలో ఎన్నో కేసులు, బెదిరింపులు, అరెస్టులు ఎదుర్కొన్నాను. ఈ విచారణలకు ఓ లెక్క కాదు.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాను. నిజాయితీగా సమాధానాలు ఇస్తాను హరీష్ రావు స్పష్టం చేశారు. ఇవాళ తనను ముగ్గురు అధికారులు విచారించారని తెలిపారు. తమకు చట్టంపై గౌరవం ఉందని.. అందుకే పోలీసులు ఇచ్చిన నోటీసులను స్వీకరించి వెంటనే విచారణకు హాజరయ్యాను అని అన్నారు. మాకు కేసీఆర్ ధైర్యంతో బతకడం నేర్పించారని తెలిపారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిజాయతీపరుడే అయితే బొగ్గు కుంభకోణం కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

ప్రజల దృష్టిని మరల్చే కుట్ర

బొగ్గు కుంభకోణం కేసులో రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం బయటపడుతుందని.. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇవాళ విచారణ పేరుతో హడావిడి చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను గంగలో కలిపారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రజలు మంత్రులను నిలదీస్తున్నారని తెలిపారు. ‘సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదర్కోవాలని.. సిట్‌లు.. గిట్‌లు అంటూ విచారణల పేరుతో విపక్షాలను వేధించే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీ పతనాన్ని నువ్వే వేగవంతం చేసుకుంటున్నావ్’ అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Next Story