- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెప్మా ఉద్యోగులకు హాఫ్ శాలరీ.. 10 నెలలుగా వేతనాల్లో కోత
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సెర్ప్, పట్టణాల్లో పనిచేసే మెప్మా.. ఈ రెండు సంస్థల విధులు ఒకేలా ఉంటాయి. సెర్ప్‌కు ఇచ్చే ఉత్తర్వులే మెప్మాకు వర్తిస్తాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మెప్మా ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మెప్మా పేరుతో ప్రత్యేక ఉత్తర్వులు లేవనే సాకుతో పది నెలలుగా ఉద్యోగులకు కేవలం సగం వేతనాలే చెల్లిస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా జీతాల్లో కోత విధిస్తుండడంతో సుమారు 280 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కమిటీ వేసినా..
మెప్మాలోని 378 మంది ఉద్యోగులకు పే స్కేల్ ఫిక్సేషన్ కోసం చర్యలు తీసుకోవాలని ఆగస్టు 2023లో అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు ఉద్యోగుల విద్యార్హతలు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాతనే పే స్కేల్ ఫిక్సేషన్‌కు చర్యలు తీసుకోవాలని నవంబర్ 2024లో అప్పటి పురపాలకశాఖ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీచేశారు. అయినా పే స్కేల్ ఫిక్సేషన్‌కు సంబంధించిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే 280 మందికి పే స్కేల్ ఫిక్సేషన్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి పురపాలకశాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి ముగ్గురు అధికారులతో ఓ కమిటీని నియమించారు. అయినా ఎలాంటి ఫలితంలేదని ఉద్యోగులు వాపోతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు..
మెప్మా ఉద్యోగులకు ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు జారీచేయకుండానే సగం వేతనంతో సరిపెడుతున్నారు. దీంతో ఈఎంఐలు, పిల్లల స్కూల్, కాలేజీల ఫీజులు చెల్లించలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు ఈనెల 25 తర్వాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. దీంతో ఎన్నికల కోడ్ పేరుతో మరింత ఆలస్యమవుతుందేమోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పురపాలకశాఖ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.






