CM రేవంత్‌ నాయకత్వంలో తెలంగాణ గణనీయమైన విజయాలు

by Gantepaka Srikanth |

‘వికసిత్ భారత్ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నది.

CM రేవంత్‌ నాయకత్వంలో తెలంగాణ గణనీయమైన విజయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘వికసిత్ భారత్ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ లక్ష్య సాధనకే తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని రూపొందించింది’ అని రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు గవర్నర్ హాజరయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ‌త డిసెంబరులో జ‌రిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ ప్రతినిధుల మ‌ధ్య ప్రభుత్వం ఈ దార్శనికప‌త్రాన్ని ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజాప్రభుత్వం.. గణనీయమైన విజయాలను సాధించిందని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని, ప్రశంస‌ల‌ను సైతం సంపాదించిందన్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో ప్రభుత్వం ఈ దార్శనిక ప‌త్రాన్నిఆవిష్కరించిందన్నారు. దీని ద్వారా ప్రభుత్వం సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను ప్రక‌టించిందని చెప్పారు.

మూడు ప్రాంతాలుగా అభివృద్ధి

ఈ విజ‌న్ డాక్యుమెంట్‌లో రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి సమతుల్య అభివృద్ధి సాధించాల‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని గవర్నర్ తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)లో భాగంగా హైదరాబాద్‌ను అన్నిర‌కాలుగా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. న‌గ‌రంలో ట్రాఫిక్ సమ‌స్యను ప‌రిష్కరించి, కాలుష్యాన్ని తగ్గిస్తూ హైద‌రాబాద్‌ను ప్రపంచస్థాయిన గరంగా తీర్చిదిద్దాల్సి ఉంటుందన్నారు. అలాగే.. పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్)లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యగల ప్రాంతాన్ని తయారీ రంగానికి కేంద్రంగా అభివృద్ధి చేయడమే ల‌క్ష్యమన్నారు. ఇక రూరల్ అగ్రికల్చర్ రీజినల్ ఎకానమీ (రేర్)లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రాష్ట్రంలోని ఇత‌ర గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టడం జ‌రుగుతుందన్నారు. ఈ దార్శనిక ప‌త్రంలోని ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి ప్రభుత్వం నిర్మాణాత్మక చ‌ర్యలు చేప‌ట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సమతుల్య, సమానమైన, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణ రైజింగ్-2047 ప్రణాళిక ద్వారా గాంధీ సరోవర్ ప్రాజెక్టు (బాపూఘాట్), గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, రెండో దశ మెట్రో రైలు, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్లను నిర్మించనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇవన్నీ 2047 నాటికి తెలంగాణను దేశ పురోగతిలో కీలక పాత్రధారిగా నిలబెడతాయన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలు, సంక్షేమం

తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నట్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటూ.. 2025లో జిల్లా కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించ‌డం జ‌రిగిందన్నారు. అలాగే.. అందె శ్రీ ర‌చించిన‌ జయజయహే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించ‌డం జ‌రిగిందని చెప్పారు. గిరిజన గ్రామమైన మేడారంలో రాష్ట్ర చ‌రిత్రలోనే తొలిసారిగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు శాశ్వత మౌలిక వసతుల కోసం రూ.251 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ జాత‌ర‌కు రెండుకోట్లకుపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. మరోవైపు.. బతుకమ్మ వేడుకలకు గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చిందని చెప్పారు.

సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం

సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల, ఉద్యోగ సర్వేను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని గవర్నర్ చెప్పారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలుచేసి దేశానికి ఆదర్శంగానిలిచిందన్నారు. ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయదినోత్సవంగా ప్రక‌టించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. దేశంలోనే పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. 1.03 కోట్ల కుటుంబాలకు రేషన్‌కార్డుల ద్వారా 3.34 కోట్ల మందికి లబ్ధి చేకూరుతున్నదని వెల్లడించారు. ప్రతినెలా 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ అవుతున్నదని తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లకు 6,500 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తూ 39 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనంకల్పిస్తున్నట్లు చెప్పారు. 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం సన్న బియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

రైతుల‌ సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని గవర్నర్ చెప్పారు. వ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే.. రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీ రూ.20,617 కోట్లతో సుమారు 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి అందించే సహాయాన్ని గతసంవత్సరం రూ.10,000 నుంచి రూ.12,000కు పెంచి సాగు పెట్టుబడిని అందిస్తున్నదన్నారు. రైతులు పండించిన ప్రతిధాన్యం గింజ‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. సన్నధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ సైతం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 14.24 లక్షల మంది రైతుల నుంచి సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు రూ.17,079.50 కోట్ల చెల్లింపులు అయిపోయినట్లు తెలిపారు. అదనంగా రూ.1,453 కోట్లను బోనస్ సబ్సిడీగా పంపిణీ చేశారన్నారు. బలమైన వ్యవసాయ మౌలిక వసతుల కారణంగా తెలంగాణ దేశంలోనే వ‌రి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

భూభారతితో భూ వివాదాలకు పరిష్కారం

సమస్యలతో నిండిన ధరణి పోర్టల్ స్థానంలో రైతులకు అనుకూలమైన భూ భారతి చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగిందని.. దీని ద్వారా దీర్ఘకాలిక భూ వివాదాలకు పరిష్కారం లభించనుందని గవర్నర్ వెల్లడించారు. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-I, II, III, IV నియామకాలను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుల, తదితర సంస్థల ద్వారా 62,749 మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణను ప్రారంభించారన్నారు. ఇప్పటివరకు 1,22,337 మంది ఉద్యోగార్థులు నమోదు కాగా, 1,892 వివిధ కంపెనీల యజమానులు ఇందులో చేరారని వెల్లడించారు. యువతకు ఉపాధి నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం స్థాపించిందని.. పాఠశాల, ఉన్నత విద్యా రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టిందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో సమగ్ర క్రీడా కేంద్రంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేసి పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ శిక్షణ, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాల క‌ల్పన‌తో తెలంగాణను గ్లోబల్ స్కిల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రైవేట్ సంస్థలతో సమానంగా పోటీపడేలా అనేక చర్యలు చేపట్టిందన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు

మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని గవర్నర్ తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్‌ను అమలు చేస్తున్నదని చెప్పారు. రూ.40,000 కోట్ల బ్యాంకు అనుసంధానం కల్పించిందన్నారు. స్వయం సహాయక సంఘాలు 236 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, నారాయణపేట, సంగారెడ్డిల‌లో రెండు పెట్రోల్ బంకులను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచాయన్నారు. హైటెక్ సిటీ సమీపంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటుచేసి, మహిళ‌ల‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో 267 కోట్ల ప్రయాణాలు చేసి సుమారు రూ.9,105 కోట్లను ఆదా చేసుకున్నారన్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తూ 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూర్చగా.. ఇప్పటివరకు రూ.753 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 53 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తూ రూ.3,593 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల గృహ స్వప్నాన్ని ప్రభుత్వం నెరవేరుస్తున్నదని గవర్నర్ చెప్పారు. ఇళ్లను మహిళల పేర్లతోనే మంజూరు చేసి సామాజిక, ఆర్థిక సాధికారతను కల్పిస్తున్నదన్నారు. చెంచు గిరిజనులకు 10,000 ఇళ్లను ప్రత్యేకంగా మంజూరుచేసిందన్నారు. చేనేత రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుతెచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,700 మంది చేనేత మ‌గ్గాలు, 43,770 పవర్ లూమ్స్ ఉన్నాయని తెలిపారు. నేతన్న బీమా పథకం కింద కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించ‌డం జ‌రుగుతుందన్నారు. సమగ్ర పట్టణాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి 27 మున్సిపాలిటీలను విలీనం చేసినట్లు తెలిపారు. జ‌రిగింది. 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా పునర్వ్యవస్థీకరించ‌డం జ‌రిగిందన్నారు. మూడు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి భద్రతను మ‌రింత పెంచామన్నారు. కాలుష్య నియంత్రణ కోసంఈవీలకు 100 శాతం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఐఎల్‌టీ విధానంతో కాలుష్య పరిశ్రమలను నగ‌రం బయటకు తరలించే ప్రక్రియ‌ను చేప‌ట్టినట్లు తెలిపారు. ముచ్చర్ల, కందుకూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది నెట్ జీరో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందన్నారు. అలాగే.. మూసీ నది పునరుజ్జీవనానికి 55 కి.మీ. మాస్టర్ ప్లాన్ సిద్ధమైందన్నారు.

జీసీసీలకు కేంద్రంగా హైదరాబాద్

హైదరాబాద్ దేశంలోనే జీసీసీలకు కేంద్రంగా నిలుస్తున్నదని గవర్నర్ కొనియాడారు. దావోస్‌లో జ‌రిగిన‌ ప్రపంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని టీమ్‌ తెలంగాణ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ప్రపంచానికిచాటిందని చెప్పారు. తెలంగాణ లైఫ్ సైస్సెస్‌ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ 2,000కు పైగా ఫార్మా, బయోటెక్ సంస్థలు ఉన్నాయిని.. దావోస్ వేదిక‌గా నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని ప్రారంభించిందని చెప్పారు. 2030 నాటికి టాప్-3 గ్లోబల్ క్లస్టర్లలో చేరడమే ప్రభుత్వలక్ష్యమన్నారు. 2025లో తెలంగాణ పోలీస్ దేశంలోనే మొదటి స్థానం పొందిందని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

Next Story