- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దశాబ్ద కాలంగా అద్దె గదుల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు
రామగిరిలో దశాబ్ద కాలంగా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు. శంకుస్థాపనలకే పరిమితమైన నిర్మాణాలు; వసతులు లేక ప్రజలు, అధికారుల అవస్థలు.

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు జరిగి దశాబ్దం కావస్తున్నా, పరిపాలన మాత్రం ఇంకా 'కిరాయి' భవనాల్లోనే మగ్గుతోంది. రామగిరి వంటి కీలక మండలాల్లో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లు కూడా సింగరేణి పాత క్వార్టర్లలోనే కొనసాగడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. గతంలో శంకుస్థాపనలు చేసినా కేవలం ఫొటోలకే పరిమితమవుతున్నాయని, వాస్తవ నిర్మాణాలపై పాలకులకు పట్టింపు లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇరుకైన గదులు, వసతుల లేమితో అటు అధికారులు, ఇటు ప్రజలు నరకం చూస్తున్నారు.
దిశ, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో కొత్త జిల్లాలు, మండలాలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ క్రమంలోనే రామగిరి మండలం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా, నేటికీ కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్ వంటి అత్యవసర విభాగాలు కూడా సింగరేణి సంస్థకు చెందిన పాత క్వార్టర్లలోనే అద్దెకు కొనసాగుతున్నాయి. ఈ ఇరుకైన గదుల్లో విధులు నిర్వహించడం అధికారులకు, పనుల కోసం రావడం ప్రజలకు నరకప్రాయంగా మారింది.
శంకుస్థాపనలకే పరిమితమైన నిర్మాణాలు..
రామగిరి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 2017 లో అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి శంకుస్థాపన చేసినా, నేటికీ పనులు ప్రారంభం కాలేదు. దీనికోసం కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు సింగరేణి సంస్థ సోలార్ ప్రాజెక్టుల కోసం వినియోగించేందుకు సిద్ధమవుతుండడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అలాగే, 2024లో మంత్రి శ్రీధర్ బాబు సమీకృత మండల కార్యాలయాల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి రెండేళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు. శంకుస్థాపనలు కేవలం ఫొటోలకే పరిమితమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వసతుల లేమి.. ప్రజల అవస్థలు..
తాత్కాలిక భవనాల్లో కనీస పార్కింగ్ సదుపాయం, కూర్చోవడానికి చోటు లేకపోవడంతో భూముల క్రయ విక్రయాలు, ధ్రువపత్రాల కోసం వచ్చే ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఈ భవనాలపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, శంకుస్థాపనలకే పరిమితం కాకుండా నిధులు కేటాయించి శాశ్వత భవనాలు నిర్మించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






