పర్యాటకంపై ప్రభుత్వం ఫోకస్

by Muthe.Rajitha |

రాష్ర్ట ప్రభుత్వం పర్యాటక రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న ప్రభుత్వం చారిత్రక కట్టడాలు, ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

పర్యాటకంపై ప్రభుత్వం ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట ప్రభుత్వం పర్యాటక రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న ప్రభుత్వం చారిత్రక కట్టడాలు, ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే భువనగిరి కోటకు రోప్ వే నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర పర్యాటక శాఖ నిమజ్ఞమైంది. అక్టోబర్ 2లోగా దీన్ని పూర్తి చేయనున్నారు. నగరంలోని చారిత్రక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయాలని ఇటీవల పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల అభివృద్ధికి పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నది.

మంజీరా, దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌ల ఆధునీకరణ

దిల్‌కుషా గెస్ట్‌హౌస్ హైదరాబాద్‌లో ప్రముఖమైన నిర్మాణం. ఈ భవనం 19వ శతాబ్దం చివరన, 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గవర్నర్ అధికారిక నివాసం లోక్ భవన్‌ను ఆనుకుని ఈ భవనం ఉంది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని సర్ అక్బర్ హైదరీ తన అధికారిక నివాసంగా దీనిని ఉపయోగించారు. హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత, ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వ అతిథి గృహంగా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని గ్రీన్‌ల్యాండ్స్ ప్రాంతంలో ఉన్న మంజీరా గెస్ట్‌హౌస్ సైతం ప్రముఖ చారిత్రక భవనంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఈ రెండు భవనాలను ఆధునీకరించాలని ప్రణాళికులు రూపొందిస్తోంది.

పర్యాటక ప్రాంతంగా తారామతి బారాదరి

గోల్కొండను పాలించిన ఏడో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో నిర్మితమైన చారిత్రక కట్టడమే హైదరాబాద్‌ నగరంలోని ఇబ్రహీంబాగ్‌లోని తారామతి బారాదరి. ఈ కట్టడానికి 12 తలుపులు ఉండటంతో ఈ పేరు వచ్చింది. దీనిలో పాట పాడినా, మాట్లాడినా ఆ ధ్వని హాలు మొత్తం స్పష్టంగా వినిపించే విధంగా ఈ కట్టడాన్ని మూసీ నది ఒడ్డున నిర్మించారు. ఈ కట్టడాన్ని తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ఇప్పటికే సంగీత కచేరీలు నిర్వహించడానికి ఓపెన్-ఎయిర్ ఆడిటోరియం ఉంది. ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ తారామతి బరాదరిని మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జి అభివృద్ధి

హైదరాబాద్‌లోని పురానాపూల్ బ్రిడ్జి ఎంతో ప్రాముఖ్య పొందింది. ఇది నగరంలోనే తొలి వంతెన. కుతుబ్ షాహీలు నిర్మించిన ఎన్నో అద్భుత కట్టడాల్లో పురానాపూల్ బ్రడ్జి ఒకటి. ఈ బ్రిడ్జి 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వన్ వెళ్లేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఎత్తు 54, పొడవు 600, వెడల్పు 35 చదరపు అడుగులతో నిర్మితమైంది. ఈ వంతెనలో 22 అర్చ్‌లు ఉన్నాయి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పురానాపూల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటకులు మరింత మంది వచ్చే విధం గా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

దుర్గం చెరువుకు మరిన్ని హంగులు

హైదరాబాద్‌లోని దుర్గం చెరువుకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ కోట, దాని సమీపంలో ఉన్న ప్రజలకు తాగు నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఈ సరస్సును నిర్మించారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ కొండల మధ్యలో దాగి ఉండటంతో సీక్రెట్ లేక్‌గా ప్రాముఖ్యత పొందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత దుర్గం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన ప్రపంచంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. నగరానికి తలమానికంగా ఉన్న దుర్గం చెరువును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Next Story