పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కార్ ఫోకస్.. నిధుల కేటాయింపునకు సీఎం అంగీకారం

by Kema Shiva Kumar |

పాలమూరు ప్రాంతం సాగునీటి భవితవ్యాన్ని మార్చే కీలక ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఫోకస్ పెట్టింది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కార్ ఫోకస్.. నిధుల కేటాయింపునకు సీఎం అంగీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు ప్రాంతం సాగునీటి భవితవ్యాన్ని మార్చే కీలక ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఫోకస్ పెట్టింది. ఏళ్ల తరబడి జాప్యం, అడ్డంకులతో నడుస్తున్న పాలమూరు ప్రాజెక్టును ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి ఇటీవలే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారులు ఈ పనులపైనే దృష్టి సారించాలని అన్నారు. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తరచుగా సమీక్షించుకుని పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు చెప్పారు.

భారీగా పెరిగిన వ్యయం..

ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం అవుతున్న కొలదీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతున్నది. తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు పూర్తి కోసం అదనంగా మరో రూ.29 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తాజా అంచనా ప్రకారం సుమారు రూ.85 వేల కోట్లకు చేరుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. 2015లో ఈ పథకాన్ని రూ.35,250 కోట్ల అంచనాతో చేపట్టారు. 2023లో సవరించిన అంచనా ప్రకారం అది రూ.55,086 కోట్లకు చేరింది. ఈ రెండు అంచనాలు సైతం 2015-16 నాటి ధరల ప్రకారం లెక్కించినవే. దీని ప్రకారమే ఇంతవరకు చేసిన ఖర్చు పోనూ సుమారు రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. ఇంకా మిగిలిన పనులకు తాజా అంచనా వర్తింపజేయడం, పాత పనులకు పెరిగిన ధరలను చెల్లించడం, డిస్ట్రిబ్యూటరీ పనులకు భూసేకరణ... ఇలా అన్నీ కలిపి మొత్తం వ్యయం రూ.85 వేల కోట్లవుతుందని నీటిపారుదలశాఖ ఓ అంచనాకు వచ్చింది. అయితే.. నిధుల కొరత వల్ల పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అదనపు నిధుల కేటాయింపునకు సీఎం రేవంత్‌రెడ్డి సైతం సానుకూలంగా స్పందించారని ఇటీవలే మంత్రి ప్రకటించారు. అందుకే.. దశలవారీగా నిధులు విడుదల చేసి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది.

లిఫ్టుల్లో సగం వరకే పంపులు, మోటార్లు..

ముఖ్యంగా టన్నెల్ పనులు, భారీ పంప్‌హౌస్‌ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, కాలువల విస్తరణ, భూసేకరణ వ్యయాల కారణంగా ఖర్చు పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కేపీ లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ వరకు పనులు పూర్తి చేసి.. 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నదే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం. అయితే.. ఈ ప్రధాన పనులను 21 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో లిఫ్టులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువ మార్గంలో వచ్చే సొరంగాలు ఉన్నాయి. మొత్తం పనులను 21 ప్యాకేజీలుగా విభజించినా, ఉద్ధండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులకు సాంకేతిక అనుమతి ఇచ్చి టెండర్లు ఖరారు చేసి పనులు చేపట్టారు. లిఫ్టుల్లో సగం వరకు మాత్రమే పంపులు, మోటార్లు అమర్చారు. మిగిలినవి ఇంకా అమర్చాల్సి ఉంది. 2023 డిసెంబరు వరకు రూ.26,472 కోట్లు ఖర్చు చేయగా, రెండేళ్లలో రూ.5,595 కోట్లు కలిపి ఇప్పటివరకు రూ.32,067 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించారు.

ప్రారంభానికి నోచుకోని డిస్ట్రిబ్యూటరీ

2016లో ఒప్పందం చేసుకున్న ప్యాకేజీల్లోనూ ఇంకా చాలా వరకు పనులు పెండింగులోనే ఉన్నాయి. 18వ ప్యాకేజీలో రూ.2,665 కోట్లకు ఒప్పందం చేసుకోగా.. ఇప్పటివరకు రూ.1,527 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పలు ప్యాకేజీల్లో 25 శాతం వరకు ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిస్ట్రిబ్యూటరీల టెండర్లు ఖరారు చేసినా ఇంకా పనులు ప్రారంభించలేదు. వీటిని అధికారికంగా రద్దు కూడా చేయలేదు. 2023లో అంచనాలను సవరించినప్పుడు సైతం ఈ ధరల్లో మార్పు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పెరిగిన ధరలు చెల్లించే నిబంధన ఉన్నందునా ఈ అదనపు మొత్తమే సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మిదేవిపల్లి వరకు ప్రధాన కాలువ పనులు, రిజర్వాయర్ నిర్మాణానికి 3,500 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. 30 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇలా భూసేకరణకు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా. ప్రాజెక్టు వ్యయ అంచనాను రూ.55,086 కోట్లకు సవరించినప్పుడు భూసేకరణ, పునరావాసానికి రూ.3,100 కోట్లుగా చూపించారు. ఇందులో రూ.1,800 కోట్లు భూసేకరణకు, రూ.900 కోట్లు పునరావాసానికి ఖర్చు చేశారు. తాజా అంచనాల ప్రకారం 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేలా పూర్తిస్థాయిలో పనులు చేయడానికి రూ.15 వేల కోట్లకు పైగా అవసరం ఉంటుందని, ఈ పనులతోపాటు భూసేకరణ కలిపి రూ.22 వేల కోట్ల వరకు ఖర్చు కావచ్చన్నది తాజా అంచనా.

ఎంత ఖర్చయినా ఓకే..

అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టుపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. నిత్యం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రాజెక్టు పరిధిలోని ఆయా జిల్లాల మంత్రులతో నిత్యం సమీక్షలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని, ప్రాధాన్యాన్ని చర్చించారు. దాంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తీసుకొని నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. అంచనాలు పెరిగినప్పటికీ వాటిని ఎలా అయినా సమకూర్చి ప్రాజెక్టు పూర్తికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సైతం ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.

బీఆర్ఎస్ హయాంలో ధోకా..

బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు విషయంలో ధోకా జరిగిందని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు తీసుకురాకపోగా.. కేవలం తాగునీటి పేరు చెప్పి నిర్మాణం ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కేవలం 7 టీఎంసీల తాగునీటి అవసరాల కోసమే నిర్మిస్తున్నట్లుగా సుప్రీంకోర్టులో, కేంద్రానికి చెప్పి నిర్మించారనేది వారి ఆరోపణ. అదే నిజం కూడా. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కెపాసిటీ 90 టీఎంసీలు కాగా.. అందుకే అనుమతులు రాలేదు. అయితే.. కాంగ్రెస్ కేంద్రంతో మాట్లాడి ఈ అనుమతులను సాధించే దిశగా కృషి చేస్తున్నది. అందులోభాగంగానే ఇటీవల కేంద్రాన్ని సైతం కలిశారు. తొందరలోనే పూర్తిస్థాయి అనుమతులు తెచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్రం సైతం అన్ని అనుమతులు ఇవ్వాల్సిందేనని అసెంబ్లీ సైతం ఇటీవల తీర్మానం చేసింది. ఒకవేళ కేంద్రం అనుమతి ఇవ్వని పక్షంలో ప్రాజెక్టు పాత డిజైన్‌ ప్రకారం జూరాల నుంచి నీరు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. ముందుగా కేంద్రం నుంచి అనుమతులు సాధించే దిశగానే ముందుకు సాగుతున్నారు.

Next Story