కేరళ ఎన్నికల ప్రచారంలో 'జెన్ జీ' జోష్: స్టెప్పులతో కేక పుట్టించిన సీఈఓ, కలెక్టర్!

by Malleboina Mahesh |

కేరళ ఎన్నికల ప్రచారంలో జోష్! 'జెన్ జీ' సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన సీఈఓ రతన్ కేల్కర్, కలెక్టర్ అను కుమారి. వీడియో వైరల్.

కేరళ ఎన్నికల ప్రచారంలో జెన్ జీ జోష్: స్టెప్పులతో కేక పుట్టించిన సీఈఓ, కలెక్టర్!
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 100 శాతం పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం సరికొత్త పంథాను ఎంచుకుంది. ముఖ్యంగా కొత్త తరం (Gen Z) ఓటర్లలో చైతన్యం నింపేందుకు రూపొందించిన ఒక హుషారైన పాట ఆవిష్కరణ కార్యక్రమం తిరువనంతపురంలో సందడిగా సాగింది. ఈ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) డాక్టర్ రతన్ యు. కేల్కర్, జిల్లా కలెక్టర్ అను కుమారి అనూహ్య రీతిలో స్పందించారు. 'జెన్ జీ' థీమ్‌తో సాగుతున్న ఆ పాటకు వారు స్వయంగా అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉన్నతాధికారులు ఇలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఓటు హక్కుపై అవగాహన కల్పించడం అక్కడి యువతలో కొత్త స్ఫూర్తిని నింపింది.

ఈ వినూత్న ప్రచారంలో అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ శివశక్తివేల్, ఎన్నికల విభాగం అండర్ సెక్రటరీ సరిన్ ఎస్ఎస్ తో పాటు బిఎల్ఓ సత్యభామ, అనఘా సజికుమార్, మానస నేతృత్వంలోని బృందం కూడా భాగస్వామ్యమైంది. రాబోయే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతాన్ని నమోదు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా గంభీరంగా ఉండే అధికారులు, ఇలా నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా పాటలు, డ్యాన్స్‌లతో ప్రచారం నిర్వహించడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు వేయడం అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు, అది ఒక గర్వకారణమైన విషయమనే సందేశాన్ని ఈ బృందం చాటిచెప్పింది.

Next Story