తీవ్ర విషాదం.. గంగానదిలో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లలు మృతి

by Malleboina Mahesh |

బల్లియాలో తీవ్ర విషాదం! గంగానదిలో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందారు. సెల్ఫీలు తీసుకుంటూ లోతులోకి వెళ్లడమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.

తీవ్ర విషాదం.. గంగానదిలో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గంగానదిలో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ రాంపూర్ ఘాట్ వద్ద చోటు చేసుకుంది. గంగానదిలో స్నానం చేస్తుండగా నలుగురు పిల్లలు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై బల్లియా జిల్లా మెజిస్ట్రేట్ (DM) మంగళ ప్రసాద్ సింగ్ అందించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం ఉదయం 7:30 నుంచి 8:00 గంటల మధ్య జరిగింది. బంధువులైన నలుగురు పిల్లలు నదిలో స్నానానికి వెళ్లారు. ఈత కొడుతూ లోతులోకి వెళ్లారు. దీంతో వారికి ఈత సరిగ్గా రాకపోవడంతో నలుగురు మునిగిపోయారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.

గాలింపు చర్యల అనంతరం ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. నాలుగో బిడ్డ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నది ఒడ్డున స్నానం చేస్తుండగా, పిల్లలు లోపలికి సుమారు 30-35 మీటర్ల దూరం వెళ్లినట్టు అధికారులు భావిస్తున్నారు. తొలుత ఒకరు మునిగిపోతుండగా, వారిని రక్షించే క్రమంలో మిగిలిన ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు. పిల్లలు నదిలో సెల్ఫీలు తీసుకుంటున్నారని, ఆ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలు జారి మునిగిపోయి ఉండవచ్చని డీఎం అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ స్నానం చేయడానికి 10-15 మీటర్ల వరకు దారి నిర్మించబడిందని, నీటి ప్రవాహం కూడా ఎక్కువగా లేదని అధికారులు తెలిపారు. అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదని డీఎం పేర్కొన్నారు.

Next Story