రూ.50 వేలు ఇస్తేనే డ్యూటీకి.. ఫాగింగ్ వర్కర్‌కు వేధింపులు

by Muthe.Rajitha |

రూ.50 వేల లంచం కోసం ఔట్ సోర్సింగ్ ఫాగింగ్ వర్కర్‌ ను వేధించిన ఘటన చాంద్రాయణగుట్ట పరిధిలో చోటి చేసుకుంది.

రూ.50 వేలు ఇస్తేనే డ్యూటీకి.. ఫాగింగ్ వర్కర్‌కు వేధింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెక్కాడితే కానీ డొక్కాడని ఓ ఫాగింగ్ వర్కర్‌పై సీనియర్ ఎంటమాలజీ తన ప్రతాపం చూపాడు. అసలే అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలై అప్పుల్లో పడిన వర్కర్‌పై కనీసం కనికరం చూపలేదు. బాధితుడి కథనం మేరకు.. రాజేంద్రనగర్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట సర్కిల్ పరిధిలో ఔట్ సోర్సింగ్ కింద ఫాగింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న పురణ్ నాలుగు నెలలుగా అనారోగ్య సమస్యతో డ్యూటీకి రాలేదు. ఆరోగ్యం కుదుట పడటంతో తిరిగి ఈ నెల 5న విధులకు హాజరయ్యాడు. 5, 6వ తేదీల్లో ఫాగింగ్ పనిచేశాడు. అలాగే ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ వేశాడు. ఇదే సమయంలో ‘నీవు ఇలాగే కొనసాగాలంటే రూ.50 వేలు ఇవ్వాలని ఎస్ఈ గంగప్ప అడుగుతున్నారని సూపర్‌వైజర్ లక్ష్మణ్ నన్ను అడిగారు.’ అని పురణ్ ఆరోపించాడు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న తాను షాక్‌కు గురయ్యానని, డబ్బులు ఇవ్వలేనని తెగేసి చెప్పానన్నాడు. తిరిగి 7న విధులకు రాగా, వర్కర్ ఫీల్డ్‌లో లేకపోవడంతో ఆ రోజు అటెండెన్స్ తీసుకోలేదు. మరుసటి రోజు సండే హాలీడే. తిరిగి ఈ నెల 9న విధులకు రాగానే ఉదయం అటెండెన్స్ తీసుకుని అదే సమయంలో మరోసారి డబ్బులు అడిగాడని, సాయంత్రం అటెండెన్స్ తీసుకోకుండానే తనను విధుల నుంచి తప్పించారని వర్కర్ ఆరోపించాడు. ఇదే అంశంపై న్యాయం కోసం యూనియన్ నుంచి కమిషనర్‌ను కలిసే ప్రయత్నం చేశానని తెలిపాడు. గురువారం కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పాడు. ఫాగింగ్ డబ్బులు అడిగిన అంశంపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రూల్స్ ప్రకారమే తొలగించాం..

రూల్స్ ప్రకారమే వర్కర్‌ను తొలగించాం. నేను ఎవరిని డబ్బులు అడగలేదు. ఎవరితోనూ అడగమని చెప్పలేదు. అయితే నాలుగు నెలల తర్వాత వచ్చిన వర్కర్‌ను ఈ నెల 5, 6, 9 తేదీల్లో ఎఫ్ఆర్ ద్వారా అటెండెన్స్ వేసి ఎందుకు పనిచేయించారని అడిగా. వర్కర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు.

- గంగప్ప, ఎస్ఈ

Next Story