తాళ్లపల్లి పత్తి మిల్లులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

by Jakkula.Mamatha |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

తాళ్లపల్లి పత్తి మిల్లులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
X

దిశ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో పత్తిగింజల బస్తాలు దగ్ధమవగా, ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో కొద్దిపాటి ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మిల్లులో నిల్వ చేసిన పత్తిగింజల బస్తాలకు ఇరువైపులా వడ్ల బస్తాలు ఉన్నప్పటికీ వాటికి పెద్దగా నష్టం జరగకపోవడం, మధ్యలోని పత్తిగింజల బస్తాలకే మంటలు వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మంటలు ఎగసి పడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్థులు, మిల్లు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కొంత ఆలస్యమై ఉంటే మంటలు పక్కనే ఉన్న వడ్ల బస్తాలకు వ్యాపించి భారీ ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మిల్లులో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అగ్నిమాపక పరికరాలు పనిచేసే స్థితిలో ఉన్నాయా? సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై అశోక్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story