- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడ్చల్ జిల్లాలో చెరువుల హద్దుల లొల్లి: దశాబ్దం దాటినా పూర్తికాని ఫైనల్ నోటిఫికేషన్లు!
మేడ్చల్ జిల్లాలో 527 చెరువులకు గాను 253 చెరువులకే ఫైనల్ నోటిఫికేషన్. హద్దుల ఖరారులో హెచ్ఎండిఏ జాప్యం.. అక్రమ నిర్మాణాలు, కొనుగోలుదారుల ఆందోళన.

దిశ, మేడ్చల్ బ్యూరో: జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది చెరువుల యొక్క ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను ఫైనలైజ్ చేయకపోవడంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందుగా మొదలైన లేక్స్ సర్వే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం నేటి వరకు కూడా చాలావరకు చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ అవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొత్తంగా 527 చెరువులను అధికారికంగా గుర్తిస్తే వాటిలో నేటి వరకు కేవలం 253 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయ్యాయి.
2014 నుంచి
హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వారు సర్వే ఆఫ్ లెగ్స్ ఇన్ హెచ్ఎండిఏ ఏరియా ప్రాజెక్టు 2014 ఆరంభం నుంచి చెరువుల యొక్క సర్వేను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో మొత్తంగా 527 చెరువులు ఉన్నాయి. దీని ప్రకారం సర్వే ప్రారంభంలోనే ఆయా చెరువు యొక్క ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటుగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ హద్దులను నిర్ణయిస్తూ నివేదికలను రూపొందించారు. కాగా 2025 సెప్టెంబర్ నెల ముగింపు సమయం వరకు 527 చెరువులకు గాను కేవలం 253 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసి ఎఫ్డిఎల్ బఫర్ జోన్ ఎఫెక్ట్ అయ్యే సర్వే నెంబర్లతో నివేదికలు ఫైనల్ చేశారు. చెరువుల సర్వే ప్రారంభించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు దశాబ్దం దాటుతున్న నేటి వరకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై నిర్మాణదారులు కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
చెరువుల వద్ద నిర్మాణాలకు హైడ్రా టెర్రర్..
నూతన శక్తితో హైడ్రా ఆవిర్భవించిన 2024 సంవత్సరంలో తొలిసారిగా బాచుపల్లి మండలంలో ఉన్న ఎర్రకుంట చెరువు వద్ద హైడ్రా చేపట్టిన భారీ అపార్ట్మెంట్ నిర్మాణం కూల్చివేత సంచలనగా మారింది. నాటి నుంచి ఆయా ప్రాంతాలలో ప్లాట్లు కొనాలన్న అపార్ట్మెంట్ నిర్మాణాలు చేయాలన్న తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో చెరువుల యొక్క హద్దులను ఫైనలైజ్ చేసి వాటికి సంబంధించిన నివేదికలను పబ్లిక్ పోర్టల్స్ లో అందుబాటులో ఉంచాల్సిన హెచ్ఎండిఏ నేటి వరకు కూడా ఆ పని చేయలేక పోయింది. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన, రూపొందించాల్సిన నివేదికలను తాస్సారం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరికి లబ్ధి చేకూర్చటానికి..?
హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువుల సర్వే ప్రాజెక్టు చేపట్టి పది సంవత్సరాలుకు పైగా అవుతున్న నేటి వరకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా చెరువులు వద్ద ఉన్న భూ యజమానులకు లబ్దిచేకూర్చటానికి గత ప్రభుత్వం హయాంలో సర్వేను ఫైనలైజ్ చేయకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా హైడ్రా ఏర్పడిన అనంతరం ఒకింత సర్వే ఫైనలైజేషన్ ముందుకు సాగుతున్నప్పటికీ ప్రధాన చెరువులో వద్ద మాత్రం ఫైనల్ సర్వే ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకు వెళ్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటికే భారీ భారీ నిర్మాణ సంస్థలు జిల్లా పరిధిలో ఉన్న వివిధ మండలాల్లో ప్రాజెక్టులు చేపట్టాయి. కొంతమంది నిర్మాణదారులు చెరువులకు సమీపంలో నిర్మాణాలు చేపట్టడంతో కొందరు ఆయా నిర్మాణాలు చెరువులోకి వస్తున్నాయి అంటూ ఫిర్యాదులు చేయడం, మీడియా మాధ్యమాలలో కథనాలు రావడం ఆయా బిల్డర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే యుద్ధ ప్రాతిపదికన చెరువుల యొక్క హద్దులను నిర్ణయించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిర్మాణదారులు, కొనుగోలుదారులు.
గుర్తించనీ వాటి సంగతేంటి..?
హెచ్ఎండిఏ నివేదికల ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 45 చెరువులు ఉండగా ఔటర్ రింగ్ రోడ్ బయటవైపు 2042 చెరువులుగా మొత్తంగా 2857 చెరువులు ఉన్నట్లుగా రిపోర్టు రూపొందించారు. కాగా వీటిలో కొన్ని చెరువులు ఏ ప్రాంతంలో ఉన్నాయి అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. 2024 హైడ్రా ఆవిర్భావం అనంతరం డిప్యూటీ సీఎంతో ఉన్నత అధికారులు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కొన్ని చెరువుల ప్రస్తావన వచ్చింది. వాటిలో చెరువులుగా నివేదించిన వాటికి కనీసం పేరును కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. కేవలం అక్కడ వాటర్ బాడీ ఉండేదని దానిలో ఎంత మేర కబ్జా అయింది ఎంత మేరా ఖాళీగా ఉన్నది అన్న విషయాన్ని మాత్రమే ఆ నివేదికలో ఉంచారు.
పేరు లేకుండా కేవలం చెరువుగా పేర్కొన్న ప్రాంతంలో ప్రస్తుతం హైరిస్జు భావన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిపై కూడా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేక పోయింది. అంతేకాకుండా ఒక ప్రైవేటు సంస్థ హైదరాబాద్ ట్యాంక్ ల పేరిట నివేదించిన మరొక రిపోర్టులో అనేక చెరువుల వాస్తవ రూపంతో వాటి విస్తీర్ణం గూగుల్ ఎర్త్ లో ఇంపోజ్ చేసి మరి అందుబాటులో ఉంచారు. వీటి ప్రకారం కూడా ప్రస్తుతం ఆయా చెరువులు భారీగానే కబ్జా అయ్యాయి. వీటన్నింటిపై కచ్చితమైన క్లారిటీ రావాలంటే మరొక ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి ఉంటుందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మండలాల వారీగా వివరాలు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తంగా 15 మండలాలు ఉన్నాయి. వీటిలో అల్వాల్ మండలంలో 8 చెరువులకు గాను ఐదు చెరువులకు, దుండిగల్ మండలంలో 43 చెరువులు ఉండగా 9 చెరువులకు, ఘట్కేసర్ మండలంలో 26 చెరువులకు 14 చెరువులు, కాప్రా మండలం లో ఆరు చెరువులకు గాను ఒక చెరువు, కీసర మండలంలో 77 చెరువులకు గాను 38 జేరువులు, కూకట్పల్లి మండలంలో 14 చెరువులకు గాను ఒక చెరువు, కీసర మండలంలో 77 చెరువులకు గాను 38 చెరువులు, మల్కాజిగిరి మండలంలో నాలుగు చెరువులకు గాను రెండు చెరువులు, మేడ్చల్ మండలంలో 129 చెరువులకు గాను 93, కుత్బుల్లాపూర్ మండలంలో 34 చెరువులకు గాను నాలుగు, షామీర్పేట్ మండలంలో 136 చెరువులకు గాను 83 చెరువులు, ఉప్పల్ మండలంలో పది చెరువులకు గాను ఒక చెరువుకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక మేడిపల్లి లో ఉన్న 9 చెరువులకు, బాలానగర్ మండలం లో ఉన్న 1 చెరువుకి, బాచుపల్లి లో 17 చెరువులకు గాను ఒక్క చెరువుకి కూడా ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయలేదు అధికారులు. ఈ చెరువుల సమీపాలలోనే ప్రస్తుతము భారీ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తున్నాయి.






