కొడుకు జల్సాలు.. గుణపాఠం చెప్పిన తండ్రి

by Muthe.Rajitha |

కుమారుడిపై ఉన్న ప్రేమతో బైక్ కొనిస్తే, ఆ కుమారుడి జల్సాలు చూసి విసిగిపోయిన తండ్రి కొడుక్కి తగిన గుణపాఠం చెప్పాడు.

కొడుకు జల్సాలు.. గుణపాఠం చెప్పిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్ : కుమారుడిపై ఉన్న ప్రేమతో కష్టపడి బైక్ కొనిస్తే, ఆ కుమారుడి జల్సాలు చేస్తూ, ప్రాణాల మీదికి తెచ్చుకుంటుండగా... విసిగిపోయిన తండ్రి కొడుక్కి తగిన గుణపాఠం చెప్పాడు. విశాఖపట్నంలోని పెందుర్తి పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ జిల్లా వేపగుంట సమీపంలోని బంటాకాలనీకి చెందిన ఒక వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఒక కుమారుడు కాలేజీకి వెళ్లడానికి బైక్ కావాలని తండ్రిని పట్టుబట్టాడు. తన ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, కుమారుడి కోరికను కాదనలేక ఏడాది క్రితం ఆయన ఒక బైక్ కొనిచ్చారు.

అయితే, బైక్ చేతికి వచ్చినప్పటి నుండి ఆ యువకుడు రూల్స్ పాటించకుండా తన స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తిరగడం ప్రారంభించాడు. అంతేకాకుండా కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల గత ఏడాది ఒక రోడ్డు ప్రమాదం జరగ్గా.. కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి, ఆటో డ్రైవర్ అయిన తండ్రి అప్పులు చేసి మరి సుమారు రూ. లక్ష వరకు ఆసుపత్రి ఖర్చుల కోసం వెచ్చించారు. అయినా ఆ యువకుడిలో మార్పు రాలేదు. హెల్మెట్ లేకుండా తిరగడం, రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా ఆ బైక్‌పై వరుసగా వేలల్లో చలానాలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా మరో ట్రాఫిక్ చలాన్ పడటంతో సహనం నశించి, బైక్ కొనివ్వడం వల్లే తన కుమారుడు పెడదారి పడుతున్నాడని భావించి బైక్‌ను కాలనీకి దూరంగా తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story