- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా భూమికి దారి కల్పించండి.. కలెక్టర్‌కు రైతు వినతి
తన వ్యవసాయ భూమికి వెళ్లేందుకు దారి కల్పించాలని, భూమి వివాదం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత భూములను సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలని ఓదెల మండలానికి చెందిన రైతు తాటికొండ రమేష్ కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.

దిశ, పెద్దపల్లి : తన వ్యవసాయ భూమికి వెళ్లేందుకు దారి కల్పించాలని, భూమి వివాదం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత భూములను సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలని ఓదెల మండలానికి చెందిన రైతు తాటికొండ రమేష్ కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని సర్వేనంబర్ 943లో తనకు 1.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. అయితే, చుట్టుపక్కల భూస్వాములు గత కొన్ని సంవత్సరాలుగా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రభుత్వ అధికారులతో భూమిని సర్వేచేయించి హద్దు రాళ్లు ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు వాటిని తొలగించారని పేర్కొన్నారు. సుమారు ఏడు గుంటల భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారని, దీని పై కేసులు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తన పొలంలోకి ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, వ్యవసాయ పనులకు వచ్చే కూలీలను కూడా బెదిరించి వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు.
రేవులకుంట చెరువును ఆక్రమించి బావులు తవ్వడం, డి-86 కాలువను ధ్వంసం చేయడం వల్ల తమ భూమికి సాగునీరు అందడం లేదని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గత ఆరు సంవత్సరాలుగా కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని వాపోయారు. 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లో, అలాగే 2025 మార్చి, మే నెలల్లో కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఇటీవల 2026 జూన్ 18న ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు భూమి కొలతలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్‌మెంట్ హక్కుల చట్టం ప్రకారం తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేసి, తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.






