పైన చూస్తే బ్రాండ్.. లోపల మొత్తం నకిలీ

by Disha Web Desk 12 |
పైన చూస్తే బ్రాండ్.. లోపల మొత్తం నకిలీ
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ఎలాంటి లైసెన్సు లేకుండానే వివిధ ర‌కాల వాహ‌నాల‌కు సంబంధించిన‌ నకిలీ ఇంజిన్ ఆయిల్‌ను బ్రాడెండ్ పేర్ల‌తో స్టిక్క‌ర్లు అంటించి విక్రియ‌స్తున్న ఇద్ద‌రిని గురువారం వ‌రంగ‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో ఇంజన్ ఆయిల్, పవర్ వెట్ బ్రేక్ ఆయిల్, స్టోనెల్ క్రిస్టల్ ఆయిల్, పవర్ హైడ్రాలిక్, పవర్ బ్రేక్ ఆయిల్, పవర్ గేర్ ఆయిల్, వీఎల్ శక్తి ఆయిల్, స్టోనర్ ప్రైడ్, శ్రీ బాలాజీ గ్రీజ్, హైడ్రో ఏడ‌బ్ల్యూ-46 పేర్ల‌తో కూడిన స్టిక్కర్లతో న‌కిలీ ఇంజ‌న్ ఆయిల్‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను వ‌రంగ‌ల్ అద‌న‌పు డీసీపీ వైభ‌వ్ గైక్వాడ్ వెల్ల‌డించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారంతో వ‌రంగ‌ల్‌లో ఆయిల్‌ను స్టోరేజ్ చేసిన ప్ర‌దేశంపై దాడులు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌నలో వ‌రంగ‌ల్‌కు చెందిన‌ వంగేటి నాగరాజు, గడిపల్లి రవీందర్ ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్ద‌రికి ఆయిల్‌ను స‌మ‌కూరుస్తున్న హైద‌రాబాద్‌కు చెందిన సునీల్ అగర్వాల్, రవీందర్లు ప‌రారీలో ఉన్నారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా ఇంజిన్ ఆయిల్‌లను రీసైక్లింగ్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మెకానిక్ షెడ్‌లు, కార్ సర్వీసింగ్ షో రూమ్‌ల నుంచి కూడా ఆయిల్‌ను సేక‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. నకిలీ ఇంజన్ ఆయిల్‌లను తయారు చేయడమే కాకుండా, వివిధ కంపెనీలకు చెందిన నకిలీ స్టిక్కర్‌లను వాడుతూ వాహ‌న‌దారుల‌కు అంట‌గ‌డుతున్నారు.



Next Story

Most Viewed