ఫిబ్రవరి ఎగుమతుల్లో 22 శాతం వృద్ధి!

by Web Desk |
ఫిబ్రవరి ఎగుమతుల్లో 22 శాతం వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి భారత ఎగుమతులు 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్ల(రూ. 2.56 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. అలాగే, దిగుమతులు కూడా 35 శాతం వృద్ధితో 55 బిలియన్ డాలర్ల(రూ. 4.16 లక్షల కోట్లు)గా ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఇంజనీరింగ్, పెట్రోలియం, కెమికల్ రంగాల్లో గణనీయమైన వృద్ధి కారణంగా ఎగుమతులు పుంజుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సమీక్షించిన నెలలో వాణిజ్య లోటు 21.19 బిలియన్ డాలర్లు(రూ. 1.60 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 13.12 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. లక్ష కోట్ల)తో పోలిస్తే 61.5 శాతం పెరిగింది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021, ఏప్రిల్ నుంచి 2022, ఫిబ్రవరి మధ్య సరుకుల ఎగుమతులు 374.04 బిలియన్ డలర్ల(రూ. 28.34 లక్షల కోట్ల)తో 45.80 శాతం వృద్ధి నమోదైంది. ఈ కాలంలో దిగుమతులు 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్ల(రూ. 41.7 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. సమీక్షించిన 11 నెలల కాలంలో వాణిజ్య లోటు ఏకంగా 97 శాతం పెరిగి 176.07 బిలియన్ డాలర్లు(రూ. 13.34 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇక, ఫిబ్రవరిలో కెమికల్స్ ఎగుమతులు 24.74 శాతం, ఇంజినీరింగ్‌ 31.34 శాతం, పెట్రోలియం ఉత్పత్తులు 66.29 శాతం, ఎలక్ట్రానిక్స్ 33.77 శాతం, రెడీమేడ్‌ దుస్తులు 18.54 శాతం వృద్ధి సాధించాయి. అలాగే, రత్నాభరణాలు, ప్లాస్టిక్ ఎగుమతులు పెరిగాయి. బంగారం దిగుమతులు 11.45 శాతం క్షీణించాయి.


Next Story

Most Viewed