- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త విద్యా సంవత్సరానికి సర్వం సిద్ధం
వేసవి సెలవుల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,927 బడులు తెరుచుకున్నాయి. నేటి నుండి 5 లక్షల మంది విద్యార్థులు కొత్త క్లాసుల్లోకి అడుగుపెట్టారు.

దిశ, కనగల్ : వేసవి సెలవులకు ముగింపు పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత విద్యార్థులు మళ్లీ తరగతి గదుల్లో అడుగు పెట్టనున్న నేపథ్యంలో విద్యాసంస్థలు సందడిగా మారనున్నాయి. కొత్త విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. పాఠశాలల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తరగతి గదుల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
జోరుగా బడిబాట కార్యక్రమాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామాలు, కాలనీల్లో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్కారు బడుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన చదువుతోపాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి సదుపాయాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. కొత్త తరగతుల్లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులతోపాటు, తమ పిల్లలకు అవసరమైన విద్యా సామగ్రిని సమకూర్చే పనిలో తల్లిదండ్రులు కూడా నిమగ్నమయ్యారు.
ఉమ్మడి జిల్లాలో 5 లక్షల మంది విద్యార్థులు..
నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలో విద్యా వ్యవస్థ విస్తృతంగా కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో మొత్తం 2,017 విద్యాసంస్థలు ఉండగా, వాటిలో 1,98,990 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 1,173 విద్యాసంస్థలు ఉండగా, 1,48,381 మంది చదువుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 737 విద్యాసంస్థలు ఉండగా, 1,53,250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 5,00,621 మంది విద్యార్థులు సోమవారం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలలో ప్రాథమిక వైద్యం, తాగునీటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ ఆదేశించింది.






