డ్రగ్ ఫ్రీ యూత్ .. డ్రగ్ ఫ్రీ నేషన్ ల‌క్ష్య‌సాధ‌నలో ప్ర‌తి విద్యార్ధి భాగం కావాలి

by Ratna Kumari |

ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ (ఐఎస్ఆర్డి) స్వచ్ఛంద సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఏ) సంయుక్త ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల పాఠశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ మరియు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డ్రగ్ ఫ్రీ యూత్ .. డ్రగ్ ఫ్రీ నేషన్ ల‌క్ష్య‌సాధ‌నలో ప్ర‌తి విద్యార్ధి భాగం కావాలి
X

దిశ, సదాశివనగర్ : ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ (ఐఎస్ఆర్డి) స్వచ్ఛంద సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఏ) సంయుక్త ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల పాఠశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ మరియు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి వి ఆర్ ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ .. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తుల జీవితాలనే కాకుండా కుటుంబాలు, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైన సామాజిక సమస్య అని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సమాజమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దేశ భద్రత, యువత భవిష్యత్తు మరియు సామాజిక శాంతికి తీవ్రమైన ముప్పుగా మారుతోందన్నారు. అక్రమ రవాణాదారులు ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల వలలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందువల్ల ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు నేర ప్రవర్తన, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు విద్యా ప్రగతిపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ అలవాటు దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని, దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి వర్గం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా అవసరమని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి సారించి విద్య, క్రీడలు, కళలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. డ్రగ్స్‌కు “నో” చెప్పడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కుటుంబంలో మానసిక ప్రశాంతత, ప్రేమ, పరస్పర గౌరవం, ఆప్యాయతలతో కూడిన వాతావరణం ఉంటే పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదిగి మంచి పౌరులుగా మారతారని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలంగా ఉండటం ద్వారా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండగలరని పేర్కొన్నారు. ఐఎస్ఆర్డి అధ్యక్షులు సోలంకి రవళి మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని, ఒత్తిడి, ఆందోళన, భయం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవడం, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చని సూచించారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన, స్నేహితుల వలయం, భావోద్వేగ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, వారి సమస్యలను అర్థం చేసుకుని సానుకూల మార్గనిర్దేశం చేయాలని తాత్కాలిక ఆనందాల కోసం ఉజ్వల భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దు అని సూచించారు.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా తమ సమయాన్ని విద్య, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవా కార్యక్రమాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కఠిన చట్టాలు మరియు శిక్షల గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే “మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం, ఇతరులను కూడా దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తాం” అనే ప్రతిజ్ఞ చేయించారు. “డ్రగ్ ఫ్రీ యూత్ – డ్రగ్ ఫ్రీ నేషన్” లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజారెడ్డి, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అమృత రాజేందర్, సర్పంచ్ శిరీష రవి, ఎస్ఐ సిద్దిక్, పార లీగల్ వాలంటీర్స్ విజయ్ కుమార్, అలీమొద్దీన్, నషా ముక్త్ భారత్ వినాయక్,జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ప్రతినిధులు సాయి కృష్ణ, ఐఎస్ఆర్డి ప్రతినిధి విఠల్ రావు, అధ్యాపక బృందం, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story