- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : మళ్ళీ రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు నేడు మళ్ళీ రోడ్డెక్కాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు శనివారం నుండి మళ్ళీ రోడ్డెక్కాయి. ఇటీవల జేబీఎం (JBM) కంపెనీకి చెందిన కొన్ని ఎలక్ట్రిక్ బస్సులలో బ్యాటరీలు పేలి వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) జేబిఎం కంపెనీకి చెందిన దాదాపు 500 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి రాకుండా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అగ్ని ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించడానికి, బస్సుల భద్రతను నిర్ధారించడానికి చైనా నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం (Technical Team) రంగంలోకి దిగింది. నిలిపివేసిన అన్ని బస్సుల బ్యాటరీ వ్యవస్థలను, పవర్ సర్క్యూట్లను ఈ టీమ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఇందులో మొదటి విడతగా 150 బస్సులలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, ప్రయాణానికి అవి పూర్తిగా సురక్షితమని టెక్నికల్ టీమ్ సర్టిఫై చేసింది.
అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఫిట్‌నెస్ సాధించిన ఈ 150 ఎలక్ట్రిక్ బస్సులను శనివారం ఉదయం నుంచే సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టాండ్ (JBS) నుండి వివిధ జిల్లాలకు నడపడం ప్రారంభించారు. దీంతో ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు కొంతవరకు తప్పాయి. ఇక గ్యారేజీల్లో ఉన్న మిగిలిన బస్సులను కూడా పూర్తిగా తనిఖీ చేస్తామని టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు. వాటి ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయిన వెంటనే, దశలవారీగా అన్ని ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా రోడ్డెక్కిస్తామని అధికారులు స్పష్టం చేశారు.






