- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తివేత
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు నిర్వహణ, మేయర్, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తయినందున, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 27న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections)కు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రంలోని పురపాలికలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. కాగా నేటితో మున్సిపల్ ఎన్నికల కోలాహలం అధికారికంగా ముగియడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct)ను ఎత్తివేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ ప్రక్రియలు పూర్తి కావడంతో పాటు, ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్లు, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తయింది.
ఎన్నికల ఫలితాలు వెలువడి, పాలకవర్గాల ఎన్నిక కూడా ముగియడంతో ఎన్నికల నియమావళి తక్షణమే రద్దవుతున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. జనవరి 27న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో ఉన్న సమయంలో కొత్త పథకాల ప్రకటనలు, బదిలీలు, ప్రభుత్వ ప్రచారాలపై ఆంక్షలు కొనసాగాయి. ఇప్పుడు కోడ్ ఎత్తివేయడం తో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పరిపాలనా పరమైన నిర్ణయాలు, బదిలీల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఎన్నికల కోడ్ ముగియడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్లు, చైర్మన్లు నేటి నుంచి తమ తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించి, అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడి ఉత్కంఠ రేపిన మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.






