- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకు రుణాల ఎగవేత కేసు.. అనిల్ అంబానీ దంపతులకు ఈడీ నోటీసులు!
ప్రముఖ వ్యాపార వేత్త, ADAG ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త, ADAG ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani), ఆయన భార్య టీనా అంబానీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలు, వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మళ్లింపు ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు సంబంధించిన అక్రమ నగదు చలామణి (Money Laundering) కేసులో అనిల్ అంబానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వివిధ సంస్థలు యస్ బ్యాంక్ నుండి సుమారు రూ. 12,000 కోట్ల రుణాలు పొందాయని, అందులో పెద్ద మొత్తంలో ఎగవేత జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
ఫెమా (FEMA) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో భారీగా ఆస్తులు కలిగి ఉన్నారని, పన్ను ఎగవేత కు పాల్పడ్డారని ఆదాయపు పన్ను శాఖ మరియు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా స్విస్ బ్యాంకుల్లోని ఖాతాలకు సంబంధించి ఈడీ వివరణ కోరుతోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన 'పండోరా పేపర్స్' లీక్‌లో అనిల్ అంబానీకి చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల వివరాలు బయటకు రావడంతో ఈ విచారణ మరింత వేగవంతమైంది. గతంలో కూడా అనిల్ అంబానీ ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
అయితే, తాజాగా సేకరించిన కొన్ని పత్రాల ఆధారంగా ఆయన భార్య టీనా అంబానీని కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. దర్యాప్తు సంస్థ అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు గతంలో వారు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది. ఈ ఆరోపణలపై రిలయన్స్ గ్రూప్ గతంలోనే స్పందిస్తూ.. తాము అన్ని నిబంధనలను పాటించామని, దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతోనే తమపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయని గ్రూప్ ప్రతినిధులు కొందరు వ్యాఖ్యానించారు.






