- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ కౌంటింగ్ కోసం ఈసీ భారీ భద్రత
బెంగాల్ కౌంటింగ్‌పై ఈసీ ప్రత్యేక నిఘా! 165 మంది అదనపు అబ్జర్వర్లు, 77 మంది పోలీస్ అబ్జర్వర్ల నియామకం. కౌంటింగ్ హాల్‌లోకి ఫోన్లపై నిషేధం.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపును పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేయడం మరియు, లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడం కోసం భారీ సంఖ్యలో అబ్జర్వర్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఒకటి కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లు ఉన్న 165 నియోజకవర్గాల కోసం 165 మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు 77 మంది పోలీస్ అబ్జర్వర్లను మోహరించింది. అయితే, వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ హాల్ లోపలికి ప్రవేశించకూడదని నిబంధన విధించింది. అలాగే కౌంటింగ్ హాల్ లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించరు. కేవలం కౌంటింగ్ అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ (RO)కు మాత్రమే దీని నుండి మినహాయింపు ఉంటుంది. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ఈసీఐ నెట్ (ECINet) ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో ఐడి కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
ప్రతి టేబుల్ వద్ద ఉండే మైక్రో-అబ్జర్వర్లు కంట్రోల్ యూనిట్ (CU) ఫలితాలను స్వతంత్రంగా నోట్ చేసుకుని, క్రాస్ వెరిఫికేషన్ కోసం కౌంటింగ్ అబ్జర్వర్లకు అందజేస్తారు. లెక్కింపు ఫలితాలను 'ఫార్మ్ 17C-II'లో నమోదు చేసి, కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం సంక్రమించిన అధికారాలతో ఎన్నికల సంఘం ఈ నియామకాలను చేపట్టింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, భయం లేని వాతావరణంలో ఫలితాలను వెల్లడించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఈసీ తెలిపింది. ఈ నెల 4న ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది.






