భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి భూకంపం

by Malleboina Mahesh |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున 2:26 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.8గా నమోదైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి వేళ భూ ప్రకంపనలు (Earthquakes) సంభవించాయి. ఆదివారం తెల్లవారుజామున 2:26 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిద్రలో ఉన్న జనం భూమి రివ్వున శబ్దం చేస్తూ కదలడంతో ఒక్కసారిగా మేల్కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత..

భూకంప శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు పాల్వంచ, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, టేకులపల్లి తదితర పరిసర మండలాల్లో ఈ భూప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. సుమారు 4 నుండి 5 సెకన్ల పాటు భూమి కంపించిందని, ఇంట్లోని పాత్రలు, మంచాలు, బీరువాలు కదిలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ భూకంపం వల్ల జిల్లాలో ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం (ఇళ్లు కూలిపోవడం వంటివి) గానీ జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం రాలేదు.

Next Story