నేడు మరోసారి బ్లడ్ బాత్.. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

by Muthe.Rajitha |

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాలతో ముగిశాయి.

నేడు మరోసారి బ్లడ్ బాత్.. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
X

దిశ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ ఒక చీకటి రోజును చూసింది. వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు భారీ పతనానికి గురయ్యాయి. దాదాపు రూ.10 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరి కావడమే కాకుండా, మార్కెట్ ఇప్పుడు అధికారికంగా 'కరెక్షన్ జోన్'లోకి ప్రవేశించింది.

నష్టాల విలవిల

ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు (1.93%) నష్టపోయి 74,563.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 488.05 పాయింట్లు (2.06%) కోల్పోయి 23,151.10 వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లోనే సెన్సెక్స్ సుమారు 4.65%, నిఫ్టీ 4.57% మేర పడిపోవడం గమనార్హం. ఒక దశలో సెన్సెక్స్ 1,579 పాయింట్లు, నిఫ్టీ 527 పాయింట్ల వరకు పతనం కావడంతో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీంతో బిఎస్ఇ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.429 లక్షల కోట్లకు పడిపోయింది.

సెక్టార్ల వారీగా నష్టాలు

ఇక ఈ రోజు మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి అన్ని రంగాల్లోనూ కనిపించింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో, ఎనర్జీ సెక్టార్లు భారీగా దెబ్బతిన్నాయి. టాటా స్టీల్ 5%, ఎస్‌బిఐ 4% మేర నష్టపోయాయి. మార్కెట్ బ్రెడ్త్ గమనిస్తే, కేవలం 899 షేర్లు మాత్రమే లాభాల్లో ఉండగా, 3,200 కంటే ఎక్కువ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ తమ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల నుండి 10% కంటే ఎక్కువ పడిపోవడంతో టెక్నికల్ కరెక్షన్ స్థిరపడింది. అయితే స్వదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(DII) రూ.9,977 కోట్లు పెట్టి షేర్లను కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ మరికొంత పతనం కాకుండా అడ్డుకోగలిగారు.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు

స్టాక్ మార్కెట్ భారీ పతనానికి పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఈ పోరు త్వరగా ముగుస్తుందని ఆశించిన ఇన్వెస్టర్లకు, కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీసుకున్న కఠిన నిర్ణయాలు షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చే సాధనంగా వాడుతూ, యుద్ధం ముగిసే వరకు దానిని మూసివేస్తామని ప్రకటించడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల మార్కును దాటాయి. ఈ చమురు ధరల పెరుగుదల భారత దిగుమతుల బిల్లును భారంగా మార్చి, రూపాయి విలువను ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయేలా చేయడమే కాకుండా, దేశీయ ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. దీనికి తోడు అమెరికాలో 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్, రెండేళ్ల బాండ్లపై రాబడులు ఆరు నెలల గరిష్ఠానికి చేరడంతో, విదేశీ పెట్టుబడిదారులు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుండి నిధులను వెనక్కి తీసుకున్నారు. దీని ప్రభావంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) గత 10 ట్రేడింగ్ సెషన్లలోనే ఏకంగా రూ.57,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం, మార్కెట్లను కోలుకోలేని విధంగా దెబ్బతీసి కరెక్షన్ జోన్లోకి నెట్టేసింది.

ఇన్వెస్టర్లకు సూచన

ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో ఒడిదుడుకులు (Volatility) ఇంకా కొనసాగే అవకాశం ఉంది. యుద్ధం ఆగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి సమయాల్లో చిన్న ఇన్వెస్టర్లు భయపడి (Panic Sell) తమ షేర్లను తక్కువ ధరకు అమ్ముకోకూడదు. నాణ్యమైన షేర్లను లాంగ్-టర్మ్ కోసం హోల్డ్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ మరికొంత పడితే, మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తుంది.

Next Story